రెండునెలల్లో జరుగనున్న బీహార్ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాల్లో విశెష ప్రభావాన్ని చూపిస్తాయి.ఉత్తరాది రాష్ట్రాల్లో విశెషంగా ప్రాబల్యం చూపగల రాజకీయ, సామాజిక శక్తులన్నీ ఏదో ఒక రూపంలో నరేంద్రమోదీకి వ్యతిరేకంగా సంఘఘటితమౌతున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ మెట్టుదిగి నితీష్ కుమార్ నే తమకూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఇప్పటికే అంగీకరించడం ఈ ఎన్నికల్లో కీలకమైన మలుపు.
పదహారో లోక్‌సభ ఎన్నికల్లోనూ, ఆతరువాత కొన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ బిజెపి ఎదురులేని విజయాలు సాధించింది. బిజేపికంటే ఎత్తుకి ఎదిగిపోయిన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ పటిమకు అద్దం పట్టేలా ఆ ఫలితాలు వెలువడ్డాయి.
అయితే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాత్రం బిజెపినే కాదు, కాంగ్రెస్ పార్టీనీ తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశాయి. అనూహ్య రీతిలో అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ 70 అసెంబ్లీ స్థానాల్లో 67సీట్లను కైవసం చేసుకుని ఘన విజయం సాధించింది. బిజెపికి కేవలం మూడు సీట్లు మాత్రమే దక్కాయి. సాక్షాత్తు ప్రధాని మోదీ పలు మార్లు బహిరంగ సభల్లో మాట్లాడినా, మొత్తం మంత్రుల్నే రంగంలోకి దింపినా ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్‌కే పట్టం కట్టడం బిజెపికి మింగుడు పడనిదిగానే మారింది. ఈ నేపధ్యంలోనే త్వరలో జరుగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ ఫలితాలు అనేక కోణాల్లో ప్రాంతీయ పార్టీలకు, జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌లకూ ఉనికి పరీక్షే పెట్టబోతున్నాయి. ఢిల్లీ ఫలితాలతో కంగుతిన్న బిజెపి బిహార్ అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, ప్రధాని నరేంద్ర మోదీ జనాకర్షక శక్తికి పరీక్షగానే పరిగణిస్తోంది. ఈ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించలేక పోతే మోదీ నాయకత్వంపై విపక్షాలు మరింతగా దుమ్మెత్తి పోసే అవకాశం ఉంటుంది కాబట్టి పార్టీ అధినేత అమిత్ షా తన రాజకీయ వ్యూహాత్మక శక్తికి మరింత పదును పెడుతున్నారు.
రంగంలో ఉన్న మిగిలిన పార్టీలన్నీ ప్రాంతీయంగా బలమైనవే. నిన్న మొన్నటి వరకూ మోదీని ఎదుర్కోవడమే ధ్యేయంగా జనతా పరివార్ కూటమిని ఏర్పాటు చేసేందుకు లాలూ, నితీష్, లాలూ ప్రసాద్ యాదవ్‌లు తీవ్ర ప్రయత్నమే చేశారు.
మాజీ జనతా దళ్ కూటమి పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకురావడం ద్వారా బిహార్‌లోనే కాకుండా జాతీయ స్ధాయిలోనూ బిజెపిని ఎదుర్కొనేందుకు గట్టి ప్రయత్నమే చేశారు.
అయితే జనతా పరివార్ కూటమి ప్రయత్నం ఆరంభ శూరత్వంగానే మారింది. ఇందులోని భాగస్వామ్య పక్షాల నేతలందరూ తమతమ రాష్ట్రాల్లో రాజకీయంగా పట్టు కలిగిన నేతలే. జనతా పరివార్ ఆలోచన తెరపైకి వచ్చిన వెంటనే అందరిలోనూ ఉత్సాహం కనిపించినా తీరా వ్యవహారం వరకూ వచ్చే సరికి రాజకీయ ఇబ్బందులు మొదలయ్యాయి. ఎవరు ఎన్ని సీట్లకు పోటీ చేయాలన్న అంశం మొదలుకుని బిహార్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు పోటీ చేయాలన్న అంశం వరకూ ప్రతీదీ సమస్యగానే మారడంతో జనతా పరివార్ కాస్త అటకెక్కింది. ఎప్పటికప్పుడు దీన్ని మళ్లీ వెలుగులోకి తెచ్చే ప్రయత్నం జరిగినా అదేదీ సాధ్యం కాక పోవడంతో అనివార్యంగానే ఆర్జెడి, అధికార జెడియూలు చేతులు కలపాల్సి వచ్చింది.
ఆరు పార్టీల జనతా పరివార్ కూటమి స్థానే బిహార్ ఎన్నికలకు సంబంధించినంత వరకూ లాలూ-నితీష్ సయోధ్యే తెరపైకి వచ్చింది. జనతా పరివార్‌లో ముసురు ఏర్పడటానికి లాలూనే కారణం అయినప్పటికీ తన రాజకీయ ఉనికిని, ఆర్జెడి రాజకీయ భవితను కాపాడుకునేందుకు ఆయన ఓ మెట్టు దిగక తప్పలేదు. తనకు పోటీ చేసే అవకాశం లేకపోవడం వల్ల తన కుటుంబ సభ్యులనే రంగంలోకి దింపేందుకు లాలూ చేసిన ప్రయత్నం ఫలించలేదు. తన చిరకాల ప్రత్యర్థి నితీష్ కుమార్‌నే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా అంగీకరించక తప్పని అనివార్య పరిస్థితి లాలూకు ఏర్పడింది. నిజానికి లాలూ ప్రసాద్ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం అవరోధాలు కల్పించకుండా ఉండి ఉంటే జనతా పరివార్ ఆచరణాత్మకం అయి ఉండేదే!
అయితే ఇప్పట్లో జాతీయ స్థాయిలో ఎన్నికలు లేవు కాబట్టే జనతా పరివార్ యోచనను పక్కన బెట్టినట్టుగా చెబుతున్నారు. తక్షణమే ఎదుర్కోవాల్సింది బిహార్ ఎన్నికలు కాబట్టి రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టడంతో పాటు..లాలూ కూడా తన రాజకీయ జీవితం విషయంలో రాజీ పడక తప్పలేదు. ఏ విధంగా చూసినా కూడా బిహార్‌లో గత కొన్ని సంవత్సరాలుగా ఆర్జెడి, జెడియూలదే అధికారంగా వస్తోంది.
దాణా కుంభకోణంలో తాను జైలుపాలైనా ముఖ్యమంత్రి పీఠంపై తన భార్య రాబ్డీ దేవిని కూర్చోబెట్టి మరీ లాలూ పరిపాలన సాగించారు. అలాంటిది నితీష్ కుమార్ సారధ్యంలో వరుసగా రెండుసార్లు జెడియూ అధికారంలోకి రావడంతో ఆర్జెడి రాజకీయంగా బలహీన పడే పరిస్ధితి ఏర్పడింది. ఎలాగైనా సరే నరేంద్ర మోదీని ఎదుర్కోవడమే ధ్యేయంగా ఉన్న ఆర్జెడి-జెడియూలతో కాంగ్రెస్, ఎన్సిపీలు చేతులు కలపడం ఒక రకంగా బిహార్‌లో బలమైన రాజకీయ కూటమి ఏర్పడినట్టే లెక్క. ముఖ్యంగా కాంగ్రెస్, ఎన్సిపిలు కూడా కలవడంతో ఈ కూటమిని లౌకిక పార్టీల కూటమిగా ప్రచారంలోకి తీసుకు వచ్చి బిజెపిని దెబ్బతీయాలన్నదే లాలూ-నితీష్ల లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ కూటమి నితీష్‌ను సిఎం అభ్యర్ధిగా తెరపైకి తీసుకువచ్చింది.
అయితే బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించక పోవడాన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో బలమైన నాయకుడు ఆ పార్టీకి లేడన్న విషయం స్పష్టం అవుతోంది. పైగా ఇప్పుడే సిఎం అభ్యర్ధిని ప్రకటించే పక్షంలో ఉమ్మడి శక్తితో పోటీ చేసే అవకాశాలు బలహీనమవుతాయన్న వాదన కూడా బిజెపి నాయకత్వంలో వినిపిస్తోంది.
బీహార్ లో బలాబలాల విషయానికొస్తే..2010 ఎన్నికల ఫలితాలను లోతుగా విశే్లషించాల్సి ఉంటుంది. 243 స్ధానాలు కలిగిన బిహార్ అసెంబ్లీలో గత ఎన్నికల్లో జెడియూ 115 సీట్లు గెలుచుకుంది. బిజెపి కూడా 91సీట్లను సంపాదించుకుని బలమైన పార్టీగా నిలబడగలిగింది. అంతకు ముందు వరకూ తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన ఆర్జెడికి 2010 ఎన్నికల్లో కేవలం 22సీట్లు మాత్రమే దక్కాయి. అప్పట్లో జెడియూ కూడా ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉండటం వల్ల రెండు పార్టీలు కలిసి కట్టుగా పని చేశాయి. లాలూ పార్టీకి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా అసెంబ్లీలో దక్కలేదు. 115సీట్లు గెలుచుకున్న జెడియూకు 22.6శాతం ఓట్లు రాగా, బిజెపికి 16.5శాతం ఓట్లు దక్కాయి. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల నాటికి జెడియూ-బిజెపిలు విడిపోయాయి. ఆ ఎన్నికల్లో బిజెపి దాని మిత్ర పక్షాలకు మొత్తం 40స్థానాల్లో 31 సీట్లు దక్కాయి. ఆర్జెడి-జెడియూలు రెండూ కంగుతిన్నాయి.
ఈ నేపథ్యంలో జరుగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరం అన్ని పార్టీలకూ తమ పట్టును చాటుకునేందుకు వేదికగా మారింది. లాలూ-నితీష్ సయోధ్య ఫలిస్తుందా? లోక్‌సభ ఎన్నికల నాటి ప్రభంజనానే్న బిజెపి మళ్ళీ నిలబెట్టుకుంటుందా అన్నది వేచి చూడాల్సిందే.