హైదరాబాద్: సెక్షన్ 8పై వివాదం నేపథ్యంలో తెలుగుదేశం నేతలు కేసీఆర్కు సంబంధించి ఒక కొత్త పాయింటు లాగారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని కామా, ఫుల్స్టాప్తో సహా పూర్తిగా తనకు చెప్పే సోనియా రాయించారని కేసీఆర్ నాడు చెప్పిన విషయాన్ని టీడీపీ నాయకులు గుర్తు చేశారు. టీడీపీ తెలంగాణ ప్రాంత సీనియర్ నాయకుడు కొత్తకోట దయాకరరెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ, నాడు చట్టాన్ని తానే రాయించినట్లు చెప్పుకున్న కేసీఆర్కు సెక్షన్ 8 అభ్యంతరకరమని అప్పుడు తెలియదా అని ప్రశ్నించారు. ఇటు ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి యనమలు రామకృష్ణుడుకూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. పునర్విభజన చట్టాన్ని తమకు అనుకూలంగా రాయించుకున్నామని కేసీఆర్ ఆనాడు చెప్పారని గుర్తుచేశారు. పార్లమెంట్లో చట్టం ఆమోదం పొందినపుడు సంబరాలు చేసుకున్నారని, నాడులేని అభ్యంతరాలు ఇప్పుడెందుకని యనమల ప్రశ్నించారు.