బడ్జెట్లు పెరిగిపోతున్నాయి.. పారితోషికాలు తగ్గించుకోకపోతే నిర్మాత అనేవాడే ఉండడు అని నిర్మాతలు గోల చేస్తుంటారు. పాపం వాళ్ల బాధ అర్థం చేసుకోవాల్సిందే. కానీ.. పారితోషికాలు తగ్గించుకొన్న మాత్రాన సరిపోదు. దుబారా ఖర్చులు కూడా తగ్గించాలి. దర్శకుడి దగ్గర ప్లానింగ్ లేకపోయినా.. నిర్మాతలు మునిగిపోవడం ఖాయం. ఇప్పుడు ఓ పెద్ద సినిమా విషయంలో ఇదే జరిగింది. ఓ అగ్ర నిర్మాత బడా దర్శకుడితో సినిమా ప్లాన్ చేశాడు. ఆ సినిమా ఏళ్ల తరబడి షూటింగ్ జరుపుకొంటూనే ఉంది. మధ్యలో ఎన్నో అవాంతరాలు. సినిమా ఆలస్యమయ్యే కొద్దీ, వడ్డీలు పెరిగిపోతాయి. పాపం.. ఆ నిర్మాత అవీ భరించాడు. కానీ దర్శకుడికి సరైన ప్లానింగ్ లేకపోవడం, నాణ్యత కోసమో, రాజీ పడని టేకింగ్ కోసమో కోట్లు తగలబెట్టడం ఆ నిర్మాతని చాలా ఇబ్బంది పెట్టిందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఆ సినిమాకు సంబంధించి వైజాగ్ లో కొంత మేర షూట్ చేశారు. ఓ రోజు డైరెక్టర్ గారు 5వేల మంది జూనియర్ ఆర్టిస్టులు కావాలన్నారు.
బడా నిర్మాత కాబట్టి… ఏదోలా సర్దుబాటు చేశారు. సెట్ కి వెళ్లాక.. ‘ఫ్రేమ్ కి వీళ్లు ఆనడం లేదు.. ఇంకో 2వేలమంది కావాలి’ అన్నారు. నిర్మాతకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అక్కడితో ఆగలేదు. హైదరాబాద్ శివార్లలో ఓ ఫైట్ కోసం భారీ సెట్ వేసి, ఏకంగా వెయ్యిమంది ఫైటర్లతో పది హేనురోజుల పాటు రిహార్సల్స్ జరిపి ఓ సీక్వెన్స్ డిజైన్ చేశారు. షూట్ రోజున డైరెక్టర్ గారు సెట్ కి వెళ్లి.. ‘అబ్బే.. ఈ సీక్వెన్స్ డిజైన్ చేయాల్సింది ఇలాక్కాదు.. మళ్లీ ప్రాక్టీస్ చేయండి’ అని వెళ్లిపోయారు. ఆ పదిహేను రోజుల కోసం నిర్మాతకు అయిన ఖర్చు రూ.2 కోట్లకు పైమాటే.
పాపం ఆ నిర్మాత. ఏరి కోరి ఆ దర్శకుడ్ని పెట్టుకొన్నందుకు పడిన పాట్లు. ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందా? ఎప్పుడు ఇందులోంచి బయటపడదామా? అని ఆ నిర్మాత కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడట. ఆ నిర్మాతకు పరిశ్రమలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఇన్నేళ్ల కెరీర్లో తాను ఇంతగా నలిగిపోయిన సినిమా మరోటి లేదట. అందుకే ఎవరు ఎదరుపడినా ‘ఆ దర్శకుడితో సినిమా ఒప్పుకొని పెద్ద తప్పు చేశాను’ అని వాపోతున్నాడట. పాపం..!