వివాదాల ‘పట్టిసీమ ఎత్తిపోతల’ పధకమే ”నదుల అనుసంధానానికి అంకురార్పణ” అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభివర్ణిస్తూండగా భారీ సాగునీటి పధకాలకు ఏసమస్యాలేని సహజ ప్రత్యామ్నాయాలు బ్యారేజీలేనన్న సిద్దాంతాన్ని ‘దుర్గంగుట్ట బ్యారేజి’ ద్వారా తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆచరణలో పెడుతున్నారు.
వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం గంగవరం గ్రామంలోని దుర్గంగుట్ట వద్ద గోదావరి నది మీద ఒక బ్యారేజిని నిర్మించాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జారీ అయిన 607 నంబరు జిఒ ప్రకారం 22 టిఎంసిల సామర్ధ్యం గల బ్యారేజి వల్ల వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాలకు సాగునీరు, తాగునీరుకు నీటి కొరత తొలగుతుంది. ఇందుకోసం సర్వే, డీపీఆర్ తయారు చేయడానికి ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్‌కు అనుమితిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అవసరమయ్యే రూ. 64.30 లక్షలను మంజూరు చేసింది.
పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోగా పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ నుంచి గోదావరి నీటిని పంపులతో ఎత్తి, పైపులతో కృష్ణా నదిలో కలిపే ఎత్తిపోతల పధకాన్ని ఆగస్టు 15 న చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. 12 పంపులకు 4 పంపుల నుంచైనా నీరుతోడి పోయడం లేదా ఒక పంపునుంచైనా ఎత్తిపోతల సెప్టెంబరు ఒకటిన లేదా ఆతరువాత ఎప్పుడైనా ప్రారంభం కావచ్చు. ఈ పధకంకింద గోదావరి నుంచి కృష్ణానది దిగువ కలిపే నీటి పరిమాణానికి సమానమైన నీటిని కృష్ణానది ఎగువనుంచి రాయలసీమకు మళ్ళించవచ్చన్నది చంద్రబాబు ఆలోచన. అనుకున్న సమయానికి పనులు కాకపోవడం వల్ల జాతికి అంకితమే తప్ప నీటి మళ్ళింపు ఇంకా జరగనేలేదు.
వానాకాలంలోనే గోదావరి ప్రవాహాలు మందగించిపోతున్న స్ధితిలో ఎత్తిపోతల వల్ల తూర్పు, సెంట్రల్, పశ్చిమ డెల్టాల్లో పదిలక్షల ఎకరాల్లో రెండోపంట ఎప్పటికీ అనిశ్చితమైపోతుందని గోదావరిజిల్లాల రైతులు ఆందోళన పడుతున్నారు. ప్రవాహాలు మందగించడం వల్ల సముద్రపు పోటుకి ఆయకట్టు చివరి భూములు చౌడుబారిపోతాయని చివరిరైతులు దిగులుపడుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో 8 మధ్య, చిన్న తరహా సాగునీటి పధకాల నిర్మాణాలు అర్ధంతరంగా ఆగిపోయి సంవత్సరాలు గడచిపోతున్నాయి. మరే రాజకీయపార్టీకీ చోటివ్వకుండా మొత్తం స్ధానాలను తెలుగుదేశానికే కట్టబెట్టిన పశ్చిమగోదావరి రుణాన్ని తీర్చకోలేనని పదేపదే చెబుతున్న చంద్రబాబు మీద ఆజిల్లా మెట్టరైతులు చికాకుపడుతున్నారు. మా పక్కనే వున్న గోదావరి నీళ్ళను మా చేలకు పారించకుండా రాయలసీమకు తీసుకుపోవడమే ఆయన కృతజ్ఞతా ఆని మండి పడుతున్నారు.
మరోవైపు పట్టిసీమ ఎత్తిపోతల పధకంపై గోదావరి యాజమాన్య బోర్డుకి తెలంగాణా ప్రభుత్వం అభ్యంతరాన్ని తెలిపింది. దీనిపై స్పందనగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ” పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేవరకే ఈ పధకం ఆతరువాత పట్టిసీమ పధకాన్ని తొలగిస్తాం” అని ప్రకటన చేయవలసి వచ్చింది.
అంతర్ జిల్లాల, అంతర్ రాష్ట్రాల, నదీజలాల సమస్యలకు నదుల అనుసంధానమే పరిష్కారమని అప్పట్లో ఇందిరాగాంధీ, ఇపుడు నరేంద్రమోదీ నినదించారు. భారీ ప్రాజెక్టులే సమస్యలకు మూలాలు. పెద్ద ప్రాజెక్టులవల్ల ముంపు సమస్యలు, నిర్వాసితులకు పునరావాసం సమస్యలు, అటవీ పర్యావరణానికీ, నదీ పర్యావరణానికీ ముప్పులు, అంతరాష్ట్ర జలవివాదాలూ తప్పడంలేదు. వీటన్నిటికీ ప్రత్యామ్నాయం నదులమీద ప్రాజెక్టులే కాక, నదులమీద ఆనకట్టలే (బా్యరేజీలు) ని మేధా పాట్కర్ వంటి సామాజిక వేత్తలు, పర్యావరణ వేత్తలూ సూచిస్తున్నారు.
బ్యారేజీలకు పెద్దగా అనుమతులు అవసరంలేదు. అయినా కూడా అన్ని రాష్ట్రప్రభుత్వాలూ భారీ ప్రాజెక్టు నిర్మాణాలకే మొగ్గు చూపుతున్నాయి. విద్యుత్ ఉత్పాదన మినహా ఇతరప్రయోజనాలలో ప్రాజెక్టుకీ, బ్యారేజీకి తేడాలేదు. ఇందుకు రాజమండ్రి వద్ద కాటన్ బ్యారేజి, విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజి ఉదాహరణలు. వీటి బాటలోనే కెసిఆర్ తాజాగా తలపెట్టిన ”దుర్గంగుట్ట బ్యారేజి” సాగునీటి వనరుల్లో సింపుల్ టెక్నాలజీ గా దేశాన్ని రేపో, మాపో ఆకర్షిస్తుంది.