భారత్‌తో జరిగిన టీ20 మ్యాచ్ ఓడిపోయినందుకు తమ స్వదేశంలో రాబోయే విపరీతమైన వ్యతిరేకతకు సాకులు వెతుక్కుంటూ పాకిస్తాన్ క్రికెట్ ఆటగాళ్లు చాలా మార్గాలు వెతుక్కున్నారు. సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ అయితే.. పిచ్ మీద అవగాహన రాలేదంటూ.. దాన్ని సాకుగా చూపి.. అందువల్ల ఓటమి పాలయ్యామని చెబుతూ.. ఆడలేక మద్దెల ఓడు అన్న నాట్యగత్తె సామెతను గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఇప్పటికీ ప్రపంచ దేశాల దృష్టిలో క్రికెట్ పసికూనలుగానే గుర్తింపు ఉన్న బంగ్లాదేశ్‌తో ఎదురైన ఓటమికి వారు ఎలాంటి సమాధానం చెప్పుకుంటారు? ఏం సాకులు వెతుక్కుంటారు. బంగ్లాదేశ్‌తో బుధవారం రాత్రి చివరి నిమిషం వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ దారుణంగా పరాజయం పాలైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 129 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అయితే సెకండ్ బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలం అయింది.
ప్రత్యేకించి.. విజయానికి బంగ్లాదేశ్ 26 పరుగుల దూరంలో ఉండగా.. పరుగు లేకుండా నియంత్రించాల్సిన బంతి మిస్‌ఫీల్డింగ్ కారణంగా ఫోర్ గా వెళ్లిపోవడం.. ఆ ఉత్సాహంలో బ్యాట్స్‌మెన్ తర్వాతి బంతిని కూడా ఫోర్‌గా మలచడం పాక్‌ను దెబ్బతీశాయి. 15 పరుగుల దూరంలో ఉండగా.. బ్యాట్స్‌మెన్ క్యాచ్ అవుట్ అయిన బంతి కాస్తా నోబాల్ కావడం పాక్‌కు ఒక శాపం అని చెప్పాలి.
అదే విధంగా విజయానికి 9 పరుగుల దూరంలో ఉండగా.. బ్యాట్స్‌మెన్ ఫోర్కు తరలించిన బంతి కూడా నోబాల్‌గా తయారై.. అదనపు పరుగును కూడా అందివ్వడం బంగ్లా దేశ్‌కు డబుల్ బొనాంజా అని చెప్పాలి.
ఈ పరిస్థితుల్లో చివరి ఓవర్లో 6 బంతులకు 3 పరుగులు చేయాల్సిన స్థితికి బంగ్లాదేశ్ చేరుకుంది. అలాంటి పరిస్థితిలో చివరి ఓవర్లో తొలి బంతిని ఒక అత్యద్భుతమైన సిక్సర్‌గా మలిచి బంగ్లా క్రికెటర్ మహ్మదుల్లా.. తమ దేశానికి ఒక తిరుగులేని విజయంతో అద్భుతమైన అనుభూతిని అందించాడు. దారుణమైన పరాజయం మూటగట్టుకున్న పాకిస్తాన్ ఈ ఓటమికి ఏం సాకులు వెతుక్కుంటుందో చూడాలి.