హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఉన్న నటి జయసుధ టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆమెను సస్పెండ్ చేశారని నిన్న మీడియాలో వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఊహాగానాలకు జయసుధ ఇవాళ తెరదించారు. ఆమె ఈ ఉదయం గాంధీభవన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారబోవటంలేదని స్పష్టీకరించారు. రెండురాష్ట్రాలలోనూ కాంగ్రెస్ పార్టీకోసం పనిచేస్తానని అన్నారు. జయసుధ పార్టీని వీడతారన్న వార్తలు మీడియా సృష్టేనని ఉత్తమ్ అన్నారు.
జయసుధ తనయుడు హీరోగా పరిచయమవుతున్న బస్తీ అనే సినిమా ఆడియో విడుదల కార్యక్రమం గత ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ఆ కార్యక్రమానికి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవటంతో జయసుధ పార్టీ మారతారనే ఊహాగానాలు గుప్పుమన్నాయి.