రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబోలో రూపుదిద్దుకొంటున్న సినిమా ‘పెద్ది’. మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. జాన్వీ కపూర్ కథానాయిక. శ్రీరామ నవమి సందర్భంగా ‘పెద్ది’ గ్లింప్స్ విడుదల చేశారు. క్రీడా నేపథ్యంలో సాగే సినిమా ఇది. చరణ్ ఓ క్రికెటర్‌గా కనిపించనున్నాడని ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే చరణ్ పాత్ర దర్శనమిచ్చింది. ఉత్తరాంధ్ర యాసలో చరణ్ పలికిన డైలాగ్.. విజువల్స్, చివర్లో క్రీజ్ ముందుకొచ్చి కొట్టిన వెరైటీ షాట్… ఇవన్నీ గ్లింప్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఏ.ఆర్ రెహమాన్ అందించిన బీజియమ్ ప్రధాన ఆకర్షణ. చరణ్ లుక్ గురించి కొత్తగా చెప్పేదేం లేదు. ‘పెద్ది’ ఫస్ట్ లుక్ వచ్చినప్పుడే ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పుడు వాళ్లకు చరణ్ గెటప్ మరింత నచ్చుతుంది.
”ఓటే పని సేసేనాకి, ఒకేనాగ బతికేనాకి ఇంత పెద్ద బతుకెందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే సేసేయాలి. పుడతామా ఏంటి మళ్లీ”
అనే డైలాగ్ తో చరణ్ ఎంట్రీ ఇచ్చిన టీజర్ ఇది. ఈ డైలాగ్ లోనే చరణ్ క్యారెక్టరైజేషన్ మొత్తం చెప్పేశాడు దర్శకుడు.
‘ఉప్పెన’తో ఆకట్టుకొన్నాడు బుచ్చిబాబు. ఆ సినిమా పెద్ద హిట్. దాంతో పెద్ద హీరోల నుంచి పిలుపు వచ్చింది. ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలి. అది అటు తిరిగి, ఇటు తిరిగి.. చరణ్ దగ్గరకు వచ్చింది. ‘రంగస్థలం’ తరవాత చరణ్‌ని ఇలా మాస్ పాత్రలో చూడడం ఇదే తొలిసారి. ఈ సినిమాలో చరణ్ పాత్ర రంగస్థలంలో చిట్టిబాబుకు మించి ఉంటుందని, చరణ్ ఫిల్మోగ్రఫీలో గుర్తుండిపోయేలా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. గ్లింప్స్ చూస్తే.. అది నిజమే అనిపిస్తోంది.