హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాకోసం ఇవాళ ఒక యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తిరుపతిలో ఇవాళ ప్రత్యేకహోదాపై కాంగ్రెస్ నిర్వహిస్తున్న సభ ప్రారంభం కావటానికిముందు ఈ ఘటన జరిగింది. ప్రత్యేకహోదాపై నినాదాలు చేస్తున్న మునికోటి అనే కాంగ్రెస్ కార్యకర్త ఉన్నట్లుండి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. సభకు హాజరైనవారు ఒక్కసారి జరిగిన ఈ ఘటనతో అవాక్కయ్యారు. పక్కనున్న కొందరు తమ చొక్కాలు విప్పి కోటిమీద కప్పి మంటలను ఆర్పటానికి ప్రయత్నించారు. అతనికి 70శాతం గాయాలయినట్లు తెలిసింది. అతనిని హుటాహుటిన రూయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటన జరిగిన తర్వాత సభలో పాల్గొనటానికి వచ్చిన పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఎంపీలు చిరంజీవి, కేవీపీ, నాయకులు జేడీ శీలం, శైలజానాథ్ ఆత్మహత్యాయత్నంపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తెలంగాణకోసం గతంలో ఇలా ఆత్మహత్యాయత్నాలు జరిగినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాకోసం ఇలా ఆత్మహత్యాయత్నం జరగటం ఇదే ప్రధమం. కోటి తిరుపతి వాసి అని, స్థానిక కాంగ్రెస్ నాయకుడు మబ్బు చెంగారెడ్డి అనుచరుడని తెలిసింది. అతను వేరేచోట కిరోసిన్ పోసుకుని సభాస్థలానికి వచ్చి నిప్పంటించుకున్నాడని తెలిసింది. మునికోటి కుటుంబాన్ని ఆదుకుంటామని, ఎవరూ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దని రఘువీరారెడ్డి విజ్ఞప్తి చేశారు. మునికోటి కుటంబానికి రు.2 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆత్మహత్యాయత్నం ఘటన అత్యంత బాధాకరమని వ్యాఖ్యానించారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్లతో మాట్లాడి ఆ యువకుడికి మెరుగైన వైద్యం అందేలాగా చేయాలని చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు బొజ్జల, గాలిలకు సూచించారు. మొత్తంమీద ఈ ఘటన ప్రత్యేకహోదాపై ఏపీ ప్రజలలో ఉన్న అసంతృప్తిని వెల్లడిస్తోంది.