ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని ఏ ముహూర్తంలో ప్రకటించారో కానీ ఇంతవరకు ఇవ్వనే లేదు. పైగా ప్రతిపక్షాలకు అది బ్రహ్మాస్త్రంలాగ, ప్రజలకు ఒక బ్రహ్మ పదార్ధంగా తయారయింది.
తనెలాగు సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం పొందబోతోందని కాంగ్రెస్ పార్టీ ముందుగానే పసిగట్టినందునే సాధ్యం కాని ప్రత్యేకహోదాని ఇస్తానని నోటి మాటగా చెప్పి బీజేపీని ఇరికించి ఉండవచ్చును. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే, ఎలాగయినా అధికారంలోకి రావాలని తహతహలాడిపోతున్న బీజేపీ ఐదేళ్ళు ఏమి సరిపోతాయి? పదేళ్ళు ఇమ్మని డిమాండ్ చేసింది. ఆ తరువాత తామే కాంగ్రెస్ మీద ఒత్తిడి తెచ్చి ప్రత్యేకహోదా ఇప్పించామని బీజేపీ ఎన్నికలలో గొప్పగా ప్రచారం చేసుకొంది కూడా. కానీ ఏడాదిన్నర గడిచినా మోడీ ప్రభుత్వం తన మాట నిలబెట్టుకోలేదు. పైగా ఏ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చే ఆలోచన లేదని మంత్రి ఇంద్రజిత్ సింగ్ తో పార్లమెంటులో ప్రకటన చేయించి చేతులు దులుపుకొంది.
ఇంతవరకు ప్రత్యేకహోదా ఇవ్వనందుకే ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తెదేపా, బీజేపీలు ఇప్పుడు ఇంద్రజిత్ సింగ్ చేసిన ప్రకటనతో ఆత్మరక్షణలో పడ్డాయి. కేంద్రానికి ప్రత్యేకహోదా ఇచ్చే ఆలోచన ఉద్దేశ్యం లేవని, ఆ విషయం గురించి ప్రధాని మోడీతో మాట్లాడుదామన్నా ఆయన ఎప్పుడూ విదేశీ యాత్రలలో కాలక్షేపం చేస్తునందున ఆయన ఎవరికీ ‘చిక్కడు దొరకడు’ అని తెదేపా ఎంపీ రాయపాటి సాంభశివరావు కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోతే తెదేపా, బీజేపీలు రెండూ కూడా నష్టపోవడం తధ్యమని ఆయనే స్వయంగా ప్రకటించేశారు. ప్రత్యేకహోదా రాదనే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ముందే తెలుసని, అందుకే ఆయన ప్రత్యేకప్యాకేజి కోసం మాట్లాడుతున్నారని తేదేపాకు చెందిన మరో ఎంపీ జెసి దివాకర్ రెడ్డి కూడా కుండ బ్రద్దలేసేసారు.
పార్లమెంటులో ఇంద్రజిత్ సింగు చెప్పిన దానికంటే, అధికారిక పార్టీకే చెందిన వీరిద్దరు చెప్పిన మాటలు తెదేపా, బీజేపీలను మరింత ఇరకాటంలో పడేశాయి. దానితో తెదేపా, బీజేపీ నేతలు సంజాయిషీలు ఇచ్చుకొనే పనిలో పడ్డారు. “ప్రత్యేకహోదా విషయంలో బీజేపీ వెనకడుగు వేయదని” బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు పురందేశ్వరి చెప్పారు. ఒక కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ ప్రత్యేకహోదా ఇవ్వబోమని విస్పష్టంగా పార్లమెంటులో ప్రకటిస్తే, మరొక కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ “ఆయన చేసిన ప్రకటన కేవలం బీహార్ ని దృష్టిలో ఉంచుకొని చేసిందే తప్ప ఆంధ్రప్రదేశ్ కి వర్తించదు” అంటూ దానికి బాష్యం చెప్పారు. తెదేపాకు చెందిన ఎంపీ మురళీ మోహన్, “కేంద్రానికి పార్లమెంటులో పూర్తి మెజారిటీ ఉంది. అది మన మీద ఆధారపడి లేదు. కనుక మేము రాజీనామాలు చేసినా కూడా ప్రత్యేకహోదా రాదు. కేంద్రంతో గొడవ పెట్టుకొనే కంటే దానితో సఖ్యతగా ఉంటూనే ఒప్పించే ప్రయత్నం చేస్తున్నామని” చెప్పుకొచ్చారు.
కానీ నరేంద్ర మోడీ స్వయంగా హామీ ఇచ్చిన తరువాత రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వడం లేదు? హామీ ఇచ్చినప్పటికీ రాష్ట్రానికి ప్రత్యేకహోదా, నిధులు ఇవ్వలేనప్పుడు, ఆయన బీహార్ రాష్ట్రానికి ఏకంగా రూ. 50,000 కోట్లు ప్రత్యేకప్యాకేజి ఏవిధంగా ప్రకటించారు? అంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అక్కడి ప్రజలను కూడా మోడీ మభ్యపెడుతున్నారా ఇప్పుడు? అనే అనుమానాలు కలుగక మానవు.
ఇంతకు ముందు ఈ ప్రత్యేక హోదా గురించి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడేవారు. కానీ ఈ విషయంలో తలకి బొప్పి కట్టిన తరువాత ఆయన దాని గురించి మాట్లాడటం మానేశారు. ఒకవేళ మీడియావాళ్ళు ఎవరయినా ఆయనని నిలదీసినా ఏదో చెప్పి తప్పించుకొంటున్నారు తప్ప కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వదలచుకొందా లేదా? అనే సంగతి ఖచ్చితంగా చెప్పడం లేదు. ఆ తరువాత దానిని ఆయన దగ్గర నుండి మరో కేంద్రమంత్రి సుజానా చౌదరి అందుకొని దాని గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. 25 శాతం…50 శాతం 60 శాతం పనులు పూర్తయిపోయాయని గణాంకాలతో సహా వివరించి మహా అయితే మరొక్క నెలలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేస్తుందని హామీ ఇచ్చేరు. కానీ ఇంద్రజిత్ సింగ్ అటువంటి భ్రమలేవీ పెట్టుకోవద్దని స్పష్టం చేసారు.
ప్రత్యేకహోదా విషయంలో తెదేపా, బీజేపీలు చేస్తున్న పరస్పర విరుద్ద ప్రకటనల వలన, ప్రజలలో నెలకొన్న అసంతృప్తిని, ఆగ్రహాన్ని మరింత రాజేస్తున్నామనే విషయం ఆ రెండు పార్టీలు గ్రహించినట్లు లేవు. అంతే కాదు వారు చేస్తున్న ఈ పరస్పర విరుద్ద ప్రకటనలు ప్రతిపక్షాలకు మరిన్ని ఆయుధాలు అందిస్తున్నాయనే విషయం కూడా గ్రహించినట్లు లేవు. ఏమయినప్పటికీ ఈ ప్రత్యేకహోదా విషయంలో తెదేపా, బీజేపీలు తమ హామీని నిలబెట్టుకోలేకపోయినట్లయితే రాయపాటి చెప్పినట్లుగా ఆ రెండు పార్టీలకు తీవ్ర నష్టం జరగవచ్చును.