ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవిధంగానయినా మాట్లాడే స్వేచ్చ ఉంటుంది ఎవరినయినా విమర్శించే అవకాశాలు ఉంటాయి. కానీ అధికారంలోకి వస్తే ఆ భావస్వేచ్చకు సదరు నేతలే స్వయంగా కళ్ళెం వేసుకోవలసి ఉంటుంది. పొరపాటునో లేక అలవాటుగానో నోరుజారితే అందుకు భారీ మూల్యం చెల్లించుకొన్న సందర్భాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీలు తరచుగా చేసే ఆరోపణ ఏమిటంటే మంత్రులు, లేదా ముఖ్యమంత్రులు అధికార పార్టీకి చెందిన మరెవరయినా డిల్లీ వెళ్ళినట్లయితే, ఏవో కేసుల నుంచి బయటపడేందుకే వెళ్ళారని అనడం.
ప్రతిపక్ష పార్టీలు ఆ మాట అంటే వాటికి వచ్చే నష్టం ఏమీ ఉండకపోవచ్చును కానీ అధికార పార్టీ అందునా కేంద్రంలో భాగస్వామిగా ఉన్న తెదేపా నేతలు అటువంటి ఆరోపణలు చేస్తే దానిని ప్రతిపక్షాలు ఏవిధంగా ఉపయోగించుకొంటాయో తెలుసుకోవాలంటే వైకాపా నేత అంబటి రాంబాబు ఏమంటున్నారో వినాల్సిందే. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, వైకపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి డిల్లీ వెళ్లి వారు హోం మంత్రి రాజ్ నాద్ సింగ్, ప్రధాని నరేంద్ర మోడి ని కలిసినప్పుడు తెదేపా నేతలు వారిరువురూ తమపై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడానికే వాళ్ళని కలిసారని ఆరోపిస్తున్నారు. అంటే ప్రధాని నరేంద్ర మోడి, రాజ్ నాద్ సింగ్ ఇద్దరినీ కలిస్తే ఎటువంటి కేసులయినా మాఫీ చేయించుకోవచ్చని తెదేపా భావిస్తున్నట్లు ఉంది. మరి బీజేపీకి మిత్రపక్షంగా ఉంటున్న తెదేపా వారిపై ఇంత తీవ్ర ఆరోపణలు చేస్తుంటే బీజేపీ నేతలు ఎందుకు వారి ఆరోపణలని ఖండించడం లేదు? అసలు బీజేపీ నేతలు ఎందుకు దీనిపై మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. నిజమే కదా?
తెదేపా నేతలు తమ రాజకీయ ప్రత్యర్దులయిన జగన్మోహన్ రెడ్డి, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ లపై ఆరోపణలు చేస్తునప్పటికీ, పరోక్షంగా ప్రధాని, హోం మంత్రి అవినీతిపరులకు కొమ్ము కాస్తున్నారని చెపుతున్నట్లుంది. మంచి లా పాయింటు తీసి తెదేపా, బీజేపీలపై విమర్శలు గుప్పించిన అంబటి రాంబాబు కూడా మళ్ళీ అటువంటి ఆరోపణే చేయడం విశేషం. ఓటుకి నోటు కేసులో ఇరువురు ముఖ్యమంత్రులకి మధ్య ప్రధాని నరేంద్ర మోడియే రాజీ కుదిర్చారని ఆరోపించారు. కానీ ఆయన అటువంటి ఆరోపణ చేసినా ఆయనకేమీ నష్టం లేదు కానీ తెదేపా నేతలు చేస్తున్న ఆరోపణల వలన తెదేపా-బీజేపీ లమధ్య చెడితే రెండు పార్టీలు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కనుక అధికార పార్టీ నేతలు ఇకపై ఇటువంటి ఆరోపణలు చేయడం మానుకోవడం మంచిది.