*ముద్రగడ ఒంటెత్తు పోకడ *డైలాగ్ కు దారి ఇవ్వని బాబు కాపులను బిసిలలో చేర్పించే ఉద్యమంలో పరిణామాలకు ఆన్ ది రికార్డుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కు నేరాన్ని అంటగట్టవచ్చు. ముద్రగడ పద్మనాభాన్ని ఏమైనా అంటే కాపులకు కోపం వస్తుంది కాబట్టి ఆఫ్ ది రికార్డుగా ఆయన మూర్ఖత్వాన్ని ఎంతైనా తిట్టుకోవచ్చు. కానీ, మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన బాధ్యతను తప్పించుకోలేదు. కాపులను బిలిల్లో చేర్పించే విషయమై సిఫార్సులకోసం 9 నెలల కాల పరిమితితో మంజునాధ్ కమీషన్ ఏర్పాటు చేసి, 100 కోట్లరూపాయలతో కాపు కార్పొరేషన్ ను స్ధాపించి ప్రభుత్వ పరమైన ప్రక్రియను ప్రారంభించారు. పని మొదలు పెట్టాముగా అని ప్రభుత్వ నేతలు చేతులు దులిపేసుకుంటే చాలదు. మూడునెలలు ముందుగానే ముద్రగడ ఇచ్చిన అల్టిమేటమ్ పై రాజకీయ ప్రక్రియ మొదలు పెట్టడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా విఫలమయ్యారు. ముద్రగడ హెచ్చరిక తరువాతే ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ ను పిలిపించుకుని సంభాషించిన చంద్రబాబుకి రాజకీయాల్లో ప్రతిష్టంభనలను నివారించడానికి “ఒక డైలాగ్” అవసరమని బాగాతెలుసు. ముద్రగడతో లేదా కాపు నాయకులతో డిమాండు పై సంప్రదింపులు జరపడానికి కనెక్టివిటీ ఏర్పాటు చేసుకోడానికి కాపు మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, పి నారాయణ, కమిడి మృణాళిని, మాణిక్యాలరావు (బిజెపి) డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ లు లేదా వీరిలో ఏకొందరినైనా ఉపయోగించుకోవచ్చు. ముద్రగడ వ్యవహారాలకు దూరంగా వుండాలన్న సంకేతాల ఫలితంగా కాపులకు తెలుగుదేశానికి మద్య ఒక విధంగా చంద్రబాబే గోడ కట్టేశారు. ఇంత జరిగాక గోడ పగలుగొట్టినా ఫలితం లేదు. ఇరువురికీ ఆమోదయోగ్యమైన ఓ పెద్దరికం కావాలి. సోషల్ లీడర్ షిప్ అనేది ఎపుడో అంతరించిపోయింది కనుక ఏ పవన్ కల్యాణో పూనుకుంటే తప్ప ఉద్రక్తతలు సడలవు. ఇదంతా పక్కన పెట్టి ”తనపని తాను చేసుకుపోయే చట్టానికి” బాధ్యతలు అప్పగించే పనిని చంద్రబాబు లాంటి నాయకులు చేయరు. పోనీ అలాగే అప్పగించినా ఆపని చేయవలసింది అధికారయంత్రాంగమే! రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం హోరెత్తిన కాపుగర్జనకు ఎవరెవరు ఎక్కడెక్కడినుంచి వస్తున్నారో ఏమి చేయబోతున్నారో పసిగట్టలేక పోయిన ప్రయోజకత్వం మన ఇంటెలిజెన్స్ వ్యవస్ధది. “ఇలాజరుగుతుందని ఊహించ లేకపోయాము” అని పోలీసు ఉన్నతాధికారి టివిలో చెప్పిన సిగ్గులేని పారదర్శకత్వం మనది. ముద్రగడ కారణంగా కాపు సమస్య విస్తృతంగా ప్రజల్లోకి దృష్టికి వెళ్లింది.చంద్రబాబు మీద వత్తిడి పెరిగింది. ముద్రగడ పేరు పదేపదే మార్మోగింది. కాపులంతా తాము రాజకీయ శక్తి అని మరోసారి రుజువు చేసుకునే అవకాశం కలిగింది. తెలుగుదేశం వ్యతిరేక పార్టీలకు పోరాడే మరో ఐక్య వేదిక దొరికింది. అదే ముద్రగడ వల్ల ముద్రగడ ఎవరినీ కలుపుకునిపోరు. ఇతరులెవరినీ ఎదగనీయరు అని తెలుగు రాష్ట్రాలకు మరోసారి తెలిసివచ్చింది. జరిగిన విధ్వంసానికి పిలుపునిచ్చింది తాము కాదని వారు సంజాయిషీ ఇచ్చుకునే పరిస్తితి వచ్చింది. ఆవేశపడిన యువకుల జీవితాలు జైల్లో కోర్టుల్లో చిక్కుకుపోయే స్ధితి ఎదురైంది. అన్నిటికీ మించి ఇతర కులాలవారిలో కాపులమీద సానుభూతి తగ్గుతుంది. కాపులను బిసిల్లో చేరిస్తే ఒప్పుకోము అంటున్న బిసిలకు ఈ పరిణామాలు స్వరాన్ని పెంచుతాయి. తమ రిజర్వేషన్లలో కాపులకు వాటా ఇవ్వాలన్నదే వారి ఆందోళన. ఇప్పటికైనా కాపులు తమనినాదాన్ని “కాపులకు రిజర్వేషన్లు కావాలి” అనిమార్చుకోవాలి. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో అమలౌతున్న రిజర్వేషన్ విధానాలను అధ్యయనం చేసి వాటిని తమకు ఎలా వర్తింప చేయవచ్చో ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు వుంచాలి. ముద్రగడ నైతికతలో నిబద్ధతలో శంకింవలసిన వ్యక్తి కాకపోయినా ఆయన ఒంటెత్తు పోకడల పర్యావసానం కళ్ళముందే వుందికనుక ప్రజాస్వామిక దృక్పధంతో ఉద్యమ కార్యక్రమాన్ని, నాయకత్వాన్ని నిర్మించడానికి కాపు పెద్దలు చొరవ చూపాలి అంతవరకూ, కాపు ఉద్యమం మళ్ళీ పట్టా ఎక్కేవరకూ కొంత స్తబ్ధత తప్పదు.