బాలినేని శ్రీనివాసరెడ్డి బలప్రదర్శన ప్రయత్నాలకు పవన్ కల్యాణ్ చెక్ పెట్టారు. పార్టీలో చేరికల కారణంగా కూటమిలో ఎదురవుతున్న పరిస్థితుల కారణంగా ఆయన ఒక్కరే వచ్చి పార్టీలో చేరాలని సందేశం పంపారు. అయితే బాలినేని ఇక్కడా .. బెట్టుకుపోయే ప్రయత్నం చేశారు. అలా అయితే చేరిక విషయం వాయిదా వేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారు.దీనికి జనసేన నుంచి అయితే ఓకే అన్న సమాధానం రావడంతో బాలినేని అవాక్కయ్యారు. రెంటికి చెడ్డ రేవడి అవుతామనుకున్నారేమో కానీ కండువా కప్పించుకోవడానికి రెడీ అయ్యారు.
బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరికపై అనేక అనుమానాలు ఉన్నాయి. కూటమి మధ్య చిచ్చు పెట్టడానికి ఇదో రకమైన మైండ్ గేమా అన్న భావనలో ఉన్నారు. ఆయన కుమారుడు , కోడలు జనసేనలో చేరికపై అంత ఆసక్తిగా లేరని అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని రగిలిపోతున్న ఆయన.. సుబ్బారెడ్డికి ఇస్తున్న ప్రాధాన్యతలో ఒక్క శాతం కూడా ఇవ్వకపోవడంతో ఆ పార్టీలో ఉండాలనుకోవడం లేదు. జరిగేదేదో జరుగుతుందని జనసేనలో చేరిపోతున్నారు.
తన రాజకీయ అనుభవంతో .. జనసేన జిల్లా పార్టీని హైజాక్ చేయాలని … అనుకుంటున్నారు. కానీ.. కూటమి పార్టీలతో ఆయన ఎలాంటి లొల్లి పెట్టుకున్నా… అది రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో బాలినేని.. బలప్రదర్శనకు పవన్ నో చెప్పారు. రెండు, మూడేళ్ల వరకూ బాలినేని సైలెంట్ గా నే ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.