రేపు అంటే అక్టోబర్ 28వ తేదీన బీహార్ అసెంబ్లీకి మూడవ దశ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ మూడవ దశలో భోజ్ పూర్, బక్సర్, నలంద, పాట్న, శరన్ మరియు వైశాలి జిల్లాలలో గల 50 నియోజకవర్గాలలో ఎన్నికలు నిర్వహించబడతాయి. ఈ 50 స్థానాలకు మొత్తం 808 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వారిలో 71 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. రేపు జరుగబోయే ఎన్నికలలో ప్రత్యేకత ఏమిటంటే మొత్తం 808 మంది అభ్యర్థులలో 215 మందిపై తీవ్రమయిన నేరాభియోగాలు ఎదుర్కొంటున్నవారే. ఇక మరో విశేషం ఏమిటంటే ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ ఇద్దరు కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్ మరియు తేజశ్వీ ప్రసాద్ భవితవ్యం రేపు జరుగబోయే ఎన్నికలలో తేలబోతోంది. వారిలో తేజ్ ప్రతాప్ యాదవ్ మహువా నుండి తేజశ్వీ ప్రసాద్ రాఘోపూర్ నుండి పోటీ చేస్తున్నారు. బీజేపీ నేత నంద కిషోర్ యాదవ్, ఉపసభాపతి అమరేంద్ర ప్రతాప్ సింగ్, బీజేపీ చీఫ్ విప్ అరుణ్ కుమార్ సిన్హా తదితర ప్రముఖులు రేపు జరుగబోయే ఎన్నికలలో పోటీచేస్తున్నారు.
రేపు ఎన్నికలు జరుగబోయే 50 నియోజక వర్గాలలో మొత్తం 1,45,85,177 ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు: 78,31,388, మహిళలు: 66,86,718, నపుంసకులు: 599 ఉన్నారు. రేపటి ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల అధికారులు పటిష్టమయిన భద్రతా ఏర్పాట్లు చేసారు. సమస్యాత్మక ప్రాంతాలయిన బక్సర్, పాట్న, శరన్ జిల్లాలలో అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేసారు. అన్ని ప్రాంతాలలో రేపు ఉదయం 8గంటలకు పోలింగ్ మొదలయి సాయంత్రం 5గంటలకు ముగుస్తుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమయిన బక్సర్ జిల్లాలో కొన్ని నియోజక వర్గాలలో ముందుగానే పోలింగ్ ముగుస్తుంది. నిన్న సాయంత్రంతోనే ఈ 50 నియోజక వర్గాలలో ఎన్నికల ప్రచారం ముగియడంతో అన్ని రాజకీయ పార్టీలు ఇక నాల్గవ దశలో ఎన్నికలు జరుగబోయే నియోజక వర్గాలలో ప్రచారం మొదలుపెట్టాయి. మళ్ళీ నాలుగవ దశ ఎన్నికలు నవంబర్ 1వ తేదీన జరుగుతాయి.