ఈరోజు సాయంత్రంతో బీహార్ అసెంబ్లీ 4వ దశ ఎన్నికలకి ప్రచారం ముగిసింది. మొదటి రెండు దశలలో రాష్ట్రాభివృద్దిపైనే ప్రధానంగా అన్ని పార్టీలు ప్రచారం సాగించినప్పటికీ, 4వ దశకి చేరుకొనే సరికి అందరూ కులాలు, మతాలు, గోవధ, గోమాంసం వంటి అప్రధాన్య అంశాలనే హైలైట్ చేస్తూ ప్రచారం కొనసాగించాయి. ప్రజలందరూ కుల,మత సామరస్యం పాటించాలని చెప్పే నరేంద్ర మోడీ సైతం ఈరోజు తన ఎన్నికల ప్రచార సభలో రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తి ఎస్సీ, ఎస్టీ, బీసీ కులస్తులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం చాలా శోచనీయం. జనతా పరివార్ ని గెలిపిస్తే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ హామీలు గుప్పిస్తుండటంతో, ప్రధాని నరేంద్ర మోడి ఈరోజు గోపాల్ గంజ్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లను వాళ్ళు (నితీష్, లాలు) వేరే ఎవరికో పంచిపెడతామని హామీలు ఇస్తున్నారు. మీకు అన్యాయం జరిగితే సహిస్తారా?” అంటూ ప్రశ్నించి బీసీలను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు.
“నితీష్ కుమార్ నన్ను బయటి వ్యక్తినని అంటున్నారు. నేనేమీ పాకిస్తాన్ ప్రదానినో, బంగ్లాదేశ్ ప్రదానినో లేకపోతే శ్రీలంక ప్రదానినో కాదు. మీరందరూ ఎన్నుకొన్న భారతదేశ ప్రధానిని. మరి నేను బయటవ్యక్తిని ఎలా అవుతాను? ఒకవేళ నేను బయట వ్యక్తినయితే, మరి డిల్లీలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు సోనియాగాంధీ ఎవరు? అభివృద్ధి గురించి మాట్లాడేందుకు వారి వద్ద ఏమీ లేనందునే ఇటువంటి పనికిమాలిన అంశాలు లేవనెత్తుతుంటారు. లాలూ ప్రసాద్ యాదవ్ తో చేతులు కలిపి నితీష్ కుమార్ బిహార్ ని మళ్ళీ ఆటవిక రాజ్యంగా మార్చాలని భావిస్తున్నట్లున్నారు. ఈ గోపాల్ గంజ్ ప్రాంతం ఇప్పటికే ఒక మినీ చంబల్ లోయగా మారుతోంది. ఒకవేళ వాళ్ళు అధికారంలోకి వస్తే, రాష్ట్రమంతటా ఇదే పరిస్థితులు ఏర్పడవచ్చును. కనుక అభివృద్ధి చెందే రాజ్యం కావాలో..లేక ఆటవిక రాజ్యం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి,” అని మోడీ ప్రజలను కోరారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మతాల గురించి మాట్లాడారు. బీహార్ ఎన్నికలలో బీజేపీ ఓడిపోతే పాకిస్తాన్ లో బాణసంచ కాలుస్తారు..మిటాయిలు పంచుకొంటారు..అలా జరగాలని మీరు కోరుకొంటున్నారా? అని ప్రశ్నిస్తూ అన్ని కులాలకు చెందిన హిందువులను బీజేపీవైపు తిప్పుకొనే ప్రయత్నం చేసారు. తమ ప్రత్యర్ధులకు అభివృద్ధి గురించి మాట్లాడేందుకు ఏమీ లేనందునే వారు అప్రదాన్యమయిన అంశాలను లేవనెత్తుతున్నారని ఆరోపిస్తున్న నరేంద్ర మోడీ, అమిత్ షా ఇరువురూ కూడా అదేవిధంగా మాట్లాడుతుండటం చాలా విచారకరం.