ఆగస్టు 15న ఎన్నికల బీహార్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం వుంది. కులాల ఓట్లే కీలకంకానున్న రాషా్ట్రల్లో బీహార్ ఒకటి. అక్కడ ఓటర్లలో వెనుకబడ్డ కులాల వారు 21 శాతంకాగా, ముస్లింలు 14.7 శాతం, యాదవులు 14.4 శాతం, కుర్మీలు 5 శాతం, కియోరీలు, మహాదళితులు 10 శాతం చొప్పున ఉన్నారు.
ఓవైపు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మిత్రసైన్యం బరిలో నిలవనుండగా, రెండోవైపు నరేంద్రమోదీ ఎన్డీఏ పక్షాలు ఎన్నికల యుద్ధానికి సిద్ధపడుతున్నాయి.
ఇప్పటికే చేతులు కలిపిన ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ సీట్ల పంపకానికి ఒక ఫార్ములాను సిద్ధం చేసుకున్నారు.. ఇది పోలింగ్ దగ్గరపడ్డాక సఖ్యత చెడకుండా, ఎన్డీఏ వ్యతిరేక వోట్లు చీలిపోకుండా దోహదపడుతుంది.
ఎన్ని సంధి ఒప్పందాలు ముందుగానేచేసుకున్నా సీట్ల పంపకం విషయంలో నితీశ్, లాలూ మధ్య వివాదాలు చెలరేగక తప్పదని వారి వెనుక వున్న సామాజిక శక్తుల నేపధ్యాన్ని బట్టి ఎన్డీఏ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే మోడీ ఆకర్షణపట్ల ఉన్న ఈ ఇద్దరికీ వున్న భయమే వీరిని కలిపి వుంచుతుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. లాలూ మెట్టుదిగడాన్నే ఇందుకు తార్కాణంగా చూపిస్తున్నారు.
అదీగాక ఆర్జేడీ, జేడీయూ మధ్య సమాన నిష్పత్తిలో సీట్ల పంపకం వుంటుందంటున్నారు. 243 శాసన సభాస్ధానాలు వున్న అసెంబ్లీలో ఈ ఫార్ములా ప్రకారం ఇరు పార్టీలూ వందేసి చొప్పున సీట్లు తీసుకునే అవకాశం వుంది.
వీటితో జతకలవనున్న కాంగ్రెస్‌కు 30 సీట్లు దక్కే వీలుంది. ఇక ఎన్సీపీకి ఐదు సీట్లను పంచవచ్చు. ప్రధానంగా నితీశ్, లాలూ కూటమి నాలుగు అంశాలపై దృష్టిపెట్టింది. మోడీ ఆకర్షణకు చెక్ పెట్టడం, స్థానిక ప్రజల్లో నితీశ్‌కున్న ప్రజాదరణను ఉపయోగించుకోవడం, ఆర్జేడీ వోట్లను తమ కూటిమివైపు తిప్పుకోవడం, కులాలవారీగా ఓట్ల సమీకరణాల్ని తమకు అనువుగా మలచుకోవడంలో విజయం సాధించాలని నితీశ్, లాలూ కూటమి ప్రణాళికలు వేసింది.
ఢిల్లీ తరువాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఇవే. ఢిల్లీలో మోడీ ఆకర్షణను రెండు అంశాలు అడ్డకున్నాయి. కాంగ్రెస్ ప్రధాన పార్టీగా నిలవకపోవడం, ప్రత్యామ్నాయ నాయకుడిగా కేజ్రీవాల్ ఆకట్టుకోవడం బీజేపీ దూకుడుకి చెక్ పెట్టాయి. ఇదే ధోరణి బీహార్‌లోనూ కనిపిస్తుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. కేజ్రీవాల్ తరహాలో నితీశ్ ప్రజానాయకుడిగా ఓట్లను లాగెయ్యవచ్చు. బీజేపీకి చెందిన ప్రత్యర్థి నాయకుడు సుసీల్ మోడీ, లోక్ జనశక్తి పార్టీ నాయకుడు రామ్ విలాస్ పాశ్వాన్‌లతో పోలిస్తే నితీశ్‌కు మెరుగైన ప్రజాదరణ వుంది. ఢిల్లీలోలాగే బీహార్‌లో కూడా కాంగ్రెస్ నామమాత్ర ప్రత్యర్థిగా మారింది.
ఫిబ్రవరిలో ఏబీపీ నీల్సన్ నిర్వహించన సర్వేలో మోడీ వ్యతిరేక కూటమికి విజయం లభిస్తుందన్న అంచనాలు వెలువడ్డాయి. జేడీయూ ఆర్జీడీ కూటమికి 56 శాతం, ఎన్డీఏ పక్షాలకు 41 శాతం చొప్పున ఓటింగ్ శాతాన్ని ఈ సర్వే అంచనా వేసింది. ఇక జూన్‌లో నిర్వహించిన సర్వేలోనూ ఇదే ధోరణి కనిపించినప్పటికీ ఓటింగ్ శాతంలో తేడా స్వల్పంగా తగ్గింది.
యాదవులు, ముస్లిం ఓట్లు లాలూ ద్వారా, కుర్మీలు, కియోరీల ఓట్లు ప్రత్యక్షంగా నితీశ్‌కు మద్దతుగా నిలుస్తాయని అంచనా. వీటికి జతగా మహాదళితులు, ముసాహార్లు తదితర ఓటర్లుసైతం గత ఎన్నికల్లో నితీశ్వైపు మొగ్గారు. అయితే ఈ సారి అంచనాలు మారవచ్చు. లాలూ, కాంగ్రెస్‌లకున్న 18 శాతం ఓటర్లు ఎంతమేర ఏవైపు నిలుస్తారన్న సందేహాలున్నాయి. ఈ విషయంలో అభ్యర్థుల ఎంపిక కీలకంగా నిలుస్తుంది.