పార్లమెంటు వర్షాకాలం సమావేశాలను జరగనిచ్చేది లేదని చెప్పి మరీ చేసి చూపించామని జబ్బలు చరుచుకున్న కాంగ్రెస్ కు షాకివ్వడానికి బీజేపీ పైఎత్తు వేసినట్టు సమాచారం. గతంలో తానే రూపొందించిన జీఎస్ టీ బిల్లును కూడా కాంగ్రెస్ స్వయంగా రాజ్యసభలో అడ్డుకుంది. చర్చ జరగకుండా రచ్చ చేసింది. డిప్యుటీ చైర్మన్ సభను వాయిదా వేసేలా చేసింది.
దీంతో మోడీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఉమ్మడి పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కీలకమైన జీఎస్ టి బిల్లును ఆమోదింప చేసుకోవడానికి ఆలస్యం తగదని సర్కార్ భావిస్తోంది. ధరల తగ్గుదల, ఆర్థిక వృద్ధి రేటు పెరుగుదల కోసం ఇది తప్పనిసరి అని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నిజానికి, ఈ సవరణ బిల్లుకు కావాల్సిన మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతును రాజ్యసభలో ప్రభుత్వం ఇప్పటికే కూడగట్టింది. అనేక ప్రతిపక్షాలు ఓటేయడానికి సిద్ధమని చెప్పాయి. కాంగ్రెస్, ఎన్సీపీ మినహా అన్ని పార్టీలూ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉంది.
రాజ్యసభలో ఓటింగ్ జరిగి ఉంటే బిల్లు నెగ్గేదే. కానీ కాంగ్రెస్ రభస వల్ల వీలు కాలేదు. ఇక ఉమ్మడి పార్లమెంటు సమావేశాలే మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. అప్పుడు రెండు సభల్లో కలిపి కావాల్సినంత సంఖ్యా బలం ఉంటుంది. పైగా ఎన్సీపీ మినహా మరే ప్రతిపక్షమూ కాంగ్రెస్ వైపు ఉండే అవకాశం లేదు. అన్నీ ఎన్డీయే ప్రతిపాదిత బిల్లుకు అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పై ఘన విజయం సాధించ వచ్చని కేంద్రం భావిస్తోంది. కాంగ్రెస్ ను దాదాపు ఏకాకిని చేయడంలో సఫలమైన బీజేపీ, ఈ తాజా వ్యూహం ద్వారా మరోసారి పైచేయి సాధించాలని, హస్తం పార్టీని పూర్తిగా డిఫెన్స్ లోకి నెట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నట్టు సమాచారం.
మరోవైపు, పార్లమెంటును మూడు వారాలపాటు స్తంభింపచేసిన కాంగ్రెస్ వైఖరిని 543 నియోజకవర్గాల్లో ఎండగట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ ఎంపీలకు సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక మంత్రి, నలుగురు ఎంపీలు కాంగ్రెస్ పై దుమ్మెత్తి పోయడమే పనిగా ప్రచార హోరు ప్రారంభిస్తారు. కాంగ్రెస్ పై పూర్తి స్థాయి దాడికి కమలనాథులు అస్త శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ మాత్రం పార్లమెంట్ సమావేశాల చివరి రోజు ఓ నిరసన ప్రదర్శన చేసింది. ఇక ముందు బీజేపీపై ఎదురు దాడికి ఏం చేస్తారనే దానిపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు లేదు.
వ్యూహాత్మకంగా బీజేపీ దూసుకుపోతుంటే, ఓటమి దెబ్బ నుంచి తేరుకోని కాంగ్రెస్ ఇంకా డీలాగానే కనిపిస్తోంది. చివరకు సుష్మా స్వరాజ్ ను ఇరుకున పెట్టబోయి ఆమె చేతికి బ్రహ్మాస్త్రం ఇచ్చినట్టయింది. అనూహ్యంగా కాంగ్రెస్ పై మాటల తూటాలను పేల్చడానికి సుష్మాకు చేజేతులా అవకాశం ఇచ్చామా అని ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కొందరు తలలు పట్టుకున్నారు. తమ పార్టీ నాయకత్వం వ్యూహత్మకంగా పొరపాటు చేయడం వల్లే సుష్మా వ్యవహారంలో పైచేయి సాధించబోయి ఆత్మరక్షణలో పడ్డామని ఆ పార్టీ నేతలు కొందరు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు కేంద్రం ప్రయోగించే ఉమ్మడి పార్లమెంట్ సమావేశాలనే బ్రహ్మాస్త్రం వ్యూహానికి కాంగ్రెస్ కౌంటర్ ఏమిటో చూద్దాం.