హైదరాబాద్: ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఛానల్లో యాడ్స్ ఇవ్వనందుకుగానూ వారి యాజమాన్యం తమపై కక్షకట్టి నెగెటివ్ పబ్లిసిటీ చేస్తోందని ఇటీవల విడుదలైన టిప్పు చిత్ర యూనిట్ ఆరోపించింది. బడ్జెట్ కారణంగా ఆ పత్రికకు, ఛానల్‌కు యాడ్స్ ఇవ్వలేకపోయామని చిత్ర దర్శకుడు జగదీశ్, హీరో సత్య కార్తీక్ చెప్పారు. యాడ్స్ ఇవ్వకపోతే నెగెటివ్ రివ్యూ రాస్తామని ఆ మీడియా సంస్థప్రతినిధులు హెచ్చరించారని తెలిపారు. తమ చిత్రానికి మంచి టాక్ వచ్చిందని, అయినప్పటికీ ఆంధ్రజ్యోతివారు కక్ష పెట్టుకుని నెగెటివ్ రివ్యూ రాయటం బాధకలిగించిందని అన్నారు. ఇలా బెదిరించినవారందరికీ యాడ్స్ ఇచ్చుకుంటూపోతే నిర్మాతలు చిత్రాలు తీయలేరని చెప్పారు.
వైజాగ్ ప్రాంతానికి చెందిన ప్రముఖ పంపిణీదారు సీతారామరాజు తన కుమారుడు సత్య కార్తీక్‌ను పరిచయంచేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 19న విడుదలయింది. ఆంధ్రజ్యోతి సినిమా పేజిలో 20వ తేదీన ఈ సినిమాపై ‘తుప్పు టిప్పు’ అని రివ్యూ వచ్చింది.