బస్టాండులో ఛాయ్ అమ్ముకొనే స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన నరేంద్ర మోడీకి పేద, మధ్యతరగతి ప్రజల కష్టాలు, వారి సమస్యలు, చిన్నచిన్న కోరికలు అన్నీ తెలిసే ఉంటాయని అందరూ అనుకొన్నారు. కడు బీదరికం నుండి ఆ స్థాయికి ఎదిగారు కనుక దేశంలో పేదలు, మధ్యతరగతి ప్రజల పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ద చూపించి వారి జీవన ప్రమాణాలు పెరిగే విధంగా చర్యలు చేపడతారని అందరూ ఆశించారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుండి కార్పోరేట్ శక్తులతో భుజాలు రాసుకొంటూ, విమానాలలో విదేశాలలో తిరుగుతూ కాలక్షేపం చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు.
దేశంలో నిరుపేదల కోసం ఆయన జనధన్ యోజన, పెన్షన్, ఆరోగ్య, భీమా వంటి పధకాలు ప్రవేశపెట్టామని చెప్పుకోవచ్చును. కానీ వాటి వలన దేశంలో ఎంత మంది నిరుపేదల జీవన ప్రమాణాలు పెరిగాయనే ప్రశ్నకు ఎవరూ సంతృప్తికరమయిన జవాబు చెప్పలేరు. సామాన్య ప్రజల కోసం మోడీ ఏమయినా చేసారా లేదా, దాని వలన వారి జీవితాలలో వెలుగులు వచ్చేయా లేదా? అనే చర్చని పక్కనబెడితే, సామాన్య కార్మికులు, మధ్యతరగతి ప్రజలు నష్టపోయే విధంగా వారి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సొమ్ముపై, కిసాన్ వికాస్ పత్రాలు, ఇతర చిన్న మొత్తాల పొదుపు పధకాలపై వడ్డీని తగ్గించేసారు.
ప్రతీ మూడు నెలలకి ఒకసారి చిన్న పొదుపు మొత్తాలపై వడ్డీ రేట్లను సమీక్షించాలని ఫిబ్రవరి 16న తీసుకొన్న నిర్ణయం ప్రకారం ప్రావిడెంట్ ఫండ్ పై ప్రస్తుతం 8.7 శాతం ఉన్న వడ్డీని, ఏప్రిల్ 1వ తేదీ నుంచి (జూన్ 30వరకు) 8.1 శాతానికి తగ్గించబడుతుంది. అదేవిధంగా మధ్యతరగతి ప్రజలు తమ వద్ద ఉన్న చిన్నచిన్న మొత్తాలను దాచుకొనేందుకు ఎంచుకొనే కిసాన్ వికాస్ పత్రాలపై వడ్డీని 8.7శాతం నుంచి 7.8 శాతాని తగ్గించబడుతుంది.
మార్కెట్లలోని వడ్డీ రేట్లకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఆర్ధిక శాఖ ప్రకటించింది. ఇకపై ప్రతీ మూడు నెలలకొకసారి వడ్డీ రేట్లు సమీక్షిస్తూ అవసరమయినపుడు తగ్గించుకొంటూ వస్తారు. అంటే ఇప్పుడు విధించిన కొత్త ఆరంభం మాత్రమేనని భావించవచ్చును. బహుశః నరేంద్ర మోడీ నుండి ఇటువంటి వినూత్నమయిన ఆలోచనలను, ప్రతిపాదనలు మధ్యతరగతి ప్రజలు ఎవరూ ఊహించి ఉండకపోవచ్చును.
వివిధ పధకాలపై ప్రస్తుతానికి తగ్గించిన వడ్డీ రేట్లు ఈవిధంగా ఉన్నాయి:
ఐదేళ్ళ జాతీయ సేవింగ్స్ సర్టిఫికెట్స్ 8.5శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించబడుతుంది.
ఐదేళ్ళ నెలసరి ఆదాయ పధకం: 8.4 శాతం నుంచి 7.8 శాతానికి తగ్గించబడుతుంది.
సుకన్యా సంవృద్ది ఖాతా: 9.2 శాతం నుంచి 8.6 శాతానికి తగ్గించబడుతుంది.
సీనియర్ సిటిజన్స్ ఐదేళ్ళ సేవింగ్స్ పధకం: 9.3శాతం నుంచి 8.6శాతానికి తగ్గించబడుతుంది.
పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్లు: ఒకటి, రెండు, మూడేళ్ళ కాలపరిమితికి ప్రస్తుతం 8.4 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఆ డిపాజిట్లపై వడ్డీని వరుసగా 7.1శాతం, 7.2శాతం, 7.4 శాతానికి తగ్గించబడుతుంది.
ఐదేళ్ళ ఫిక్సడ్ డిపాజిట్లు: 8.5శాతం వడ్డీని 7.9 శాతానికి తగ్గించబడుతుంది.
ఐదేళ్ళ రికరింగ్ డిపాజిట్లు: 8.4శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించబడుతుంది.