హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారం కేసు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు అయితే బాలకృష్ణ పన్నీర్ సెల్వమ్(జయలలిత రాజీనామా చేయాల్సివచ్చినపుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్థానంలో నియమితులయ్యే ఆమె అనుయాయుడు) పాత్ర పోషిస్తారని అని ఈమధ్య మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బాలకృష్ణ ఇవాళ స్పందించారు. తాను ముఖ్యమంత్రినవుతాననే వార్తలను ఖండించారు. తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపే శక్తి చంద్రబాబుకే ఉందని అన్నారు. హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్గా వ్యవహరిస్తున్న బాలయ్య, ఇవాళ ఆ ఆసుపత్రి వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎప్పటికీ చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటారని, ఆయన నాయకత్వంలోనే తాను పనిచేస్తానని అన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్లోకూడా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని నెలకొల్పుతానని చెప్పారు.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నామినేటెడ్ ఎమ్మెల్యే స్పీఫెన్సన్కు ఫోన్ చేసి మాట్లాడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆయనకు నోటీసు ఇస్తారని, అరెస్టు చేస్తారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.