లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ తో తెలంగాణ ప్రభుత్వం మొదలుపెట్టబోతున్న ప్రాజెక్టు మూసీ సుందరీకరణ. మూసీని మారుస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్తూ, మూసీపై ఉన్న ఆక్రమణల తొలగింపు మొదటి చర్యగా పని మొదలుపెట్టారు.
మూసీపై ఉన్న ఆక్రమణల తొలగింపు బాధ్యత ఇప్పుడు హైడ్రాది. హైదరాబాద్ లో హైడ్రా అంటేనే హాడలెత్తిపోతున్నారు. తెల్లారేసరికి ఇండ్లు నేలమట్టం చేస్తారన్న భయం పట్టుకుంది. అయితే, మూసీకి ఆనుకొని ఉన్న ఆక్రమణల విషయంలో అధికారులు కొంత సంయమనంతో సాగుతున్నారు. మూసీ ఆక్రమణల కూల్చివేతల్లో భాగంగా ఇండ్లు కోల్పోయిన పేదవారికి 15వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వం రిజర్వ్ చేసింది. దీంతో వెంటనే కూల్చివేతలకు రంగం సిద్ధం చేసింది.
మూసీ చుట్టూ ఉన్న ఆక్రమణల లెక్క తేల్చే పనిలో జీహెచ్ఎంసీ, రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. హద్దుల లెక్క తేల్చుతూ మార్కింగ్ చేస్తున్నారు. అంటే మార్కింగ్ ఉన్న వరకు నిర్మాణాలు ఏం ఉన్నా కూల్చివేయబోతున్నారు.
కూల్చివేతల సందర్భంగా కన్నీరు మున్నీరు అవుతూ అధికారులను వేడుకుంటున్న దృశ్యాలు చాలా కనిపిస్తున్నాయి. కనీసం తమ సామాన్లు తీసుకోనివ్వటం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాలున్నాయి. దీంతో ఈసారి మూసీ చుట్టూ అక్రమ నిర్మాణాల్లో ఉన్న వారిని డబుల్ బెడ్ రూంలకు షిఫ్ట్ అయ్యే వరకు సమయం ఇచ్చి, కూల్చివేతలు చేపట్టాలని నిర్ణయించారు.