త్వరలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక ఆ రాష్ట్రంలో రాజకీయ పార్టీల హడావుడి బాగా పెరిగిపోయింది. అన్ని పార్టీలు చేతికి చిక్కిన లేదా అందుబాటులో ఉన్న ప్రతీ అంశాన్ని, సమస్యని కూడా వాడేసుకొని ప్రజలను ఆకట్టుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. బహుశః ఆ ప్రయత్నాలలో భాగంగానే తమిళనాడు ప్రభుత్వం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలులో ఉన్న ఏడుగురు ఖైదీలను విడుదల చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. వారందరూ శ్రీలంకలోని తమిళుల హక్కుల కోసం పోరాడిన ఎల్.టి.టి.ఈ.(ఉగ్రవాద సంస్థ)కి చెందినవారవడంతో వారిపై తమిళనాడు ప్రజలలో సానుభూతి ఉంది. దానిని రాష్ట్రంలో రాజకీయ పార్టీలు సొమ్ము చేసుకోవాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి కనుక మళ్ళీ ఈ అంశంతో రాజకీయ లబ్ది పొందాలని అధికారంలో ఉన్న అన్నాడిఎంకె పార్టీ అధినేత్రి మరియు ముఖ్యమంత్రి జయలలిత ఆలోచిస్తున్నారు. వారు మన దేశ ప్రధాని హత్యకు కారకులని తెలిసి ఉన్నప్పటికీ వారిని ఉదారంగా క్షమించేసి విడుదల చేయడానికి సిద్దం అవుతున్నారు. ఆ ప్రయత్నాలలో సఫలం అయితే రానున్న ఎన్నికలలో తమిలప్రజలు అందరూ కళ్ళు మూసుకొని తమ పార్టీకే ఓట్లే వేసేస్తారని ఆమె ఆలోచన కావచ్చును.
తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.జ్ఞానందికేశన్ నిన్న కేంద్ర హోం కార్యదర్శి రాజీవ్ మహర్షికి ఒక లేక వ్రాసారు. “రాజీవ్ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మురుగన్, శాంతాన్, పెరారివల్లన్, నళిని, రవిచంద్రన్, రాబర్ట్ పయాస్ మరియు జియకుమార్ పెట్టుకొన్న పిటిషన్లను పరిశీలించిన తమిళనాడు ప్రభుత్వం, వారందరూ ఇప్పటికే 24సం.లు జైలు శిక్ష అనుభవించారు కనుక వారినందరినీ విడుదల చేయాలని భావిస్తోంది. మా ప్రభుత్వం దీని కోసం సుప్రీం కోర్టుని ఆశ్రయించేందుకు అవకాశం ఉన్నప్పటికీ, ఇది కేంద్రం పరిధిలో ఉందనే ఉద్దేశ్యంతో మీకు ఈ లేఖ వ్రాస్తున్నాము. గత ఏడాది డిశంబర్ 2వ తేదీన ఈ కేసుపై దాఖలయిన రివ్యూ పిటిషన్ పై సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పులో క్రిమినల్ పిసిలోని సెక్షన్: 435లో ఉన్న ‘సంప్రదింపులు’ అనే పదాన్ని ఉటంకించినందున, ఈ కేసులో ఖైదీలను విడిచిపెట్టేందుకు మా ప్రభుత్వంకున్న హక్కులకు భంగం కలగకుండా చూడాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ఖైదీలు అందరూ 24 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించేరు కనుక వారికి క్షమాభిక్ష పెట్టి విడుదల చేయాలనీ మా ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై మీ అభిప్రాయం తెలియజేయవలసిందిగా కోరుతున్నాము,” అని ఆయన తన లేఖలో వ్రాసారు.
ఆ ఏడుగురు ఖైదీలలో మురుగన్-ఎల్.టి.టి.ఈ.ఆత్మహుతి దళ సభ్యుడు. శాంతన్-ఎల్.టి.టి.ఈ. ఇంటలిజన్స్ విభాగంలో సభ్యుడు. అతనే రాజీవ్ గాంధి హత్యకు ప్రణాళిక రచించాడు. పెరారివల్లన్-రాజీవ్ గాంధి హత్యకు అవసరమయిన బాంబులను ఏర్పాటు చేసాడు. నళిని-రాజీవ్ గాంధిని హత్య చేయడానికి శ్రీలంక నుండి వచ్చిన ఇద్దరు ఎల్.టి.టి.ఈ. ఉగ్రవాదులు శుభ మరియు తనులకు తన ఇంట్లో ఆశ్రయం కల్పించింది. రవిచంద్రన్- ఈ హత్యలో పాల్గొన్నవారు ఉపయోగించేందుకు వాహనం కొనుగోలు చేయడానికి డబ్బు సమకూర్చాడు. రోబర్ట్ పయాస్-శ్రీలంకలో ఎల్.టి.టి.ఈ.ఉగ్రవాదులను అణచివేసేందుకు భారత్ నుండి పంపబడిన శాంతి సేనల కాల్పులలో తన కుమారుడిని కోల్పోయినందుకు రాజీవ్ గాంధీపై ప్రతీకారం తీర్చుకొనేందుకు ఈ కుట్రలో పాల్గొన్నాడు. జియకుమార్-శ్రీలంక నుండి వచ్చిన ఎల్.టి.టి.ఈ.ఉగ్రవదులకి చెన్నైలో ఇళ్ళను ఏర్పాటు చేసాడు.
వీరిలో పెరారివల్లన్,మురుగన్, శాంతాన్ లకు సుప్రీం కోర్టు ఉరి శిక్ష విధించింది. వారి క్షమాభిక్ష పిటిషన్లని రాష్ట్రపతి కూడా తిరస్కరించారు. అప్పుడు తమిళనాడు శాసనసభ వారి ఉరి శిక్షను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పును మద్రాసు హైకోర్టులో సవాలు చేయడంతో వారి ఉరి శిక్షపై మద్రాసు హైకోర్టు స్టే విధించింది. ఆవిధంగా వారు త్రుటిలో ఉరి శిక్ష తప్పించుకొన్నారు. వారినందరినీ తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జైలు నుండి విడిచిపెట్టాలని భావిస్తోంది. ఆ ఎన్నికలలో అధికార అన్నాడిఎంకె పార్టీతో పొత్తులు పెట్టుకొని తమిళనాడులో కూడా బీజేపీని బలోపేతం చేసుకోవాలని చాలా ఆశపడుతున్న మోడీ ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్రాసిన లేఖకు సానుకూలంగా స్పందించినా ఆశ్చర్యం లేదు. లేకుంటే అమ్మకి ఆగ్రహం కలుగుతుంది. దాని వలన ఎన్నికలలో బీజేపీ నష్టపోతుంది.