హైదరాబాద్: వివాదాస్పద మాతాజీ రాధేమాను సమర్థించే బాలీవుడ్ ప్రముఖుల జాబితాలో మరొకరు చేరారు. గాయకుడు సోనూ నిగమ్ రాధేమాను సమర్థిస్తూ ఇవాళ కొన్ని వివాదాస్పద ట్వీట్లు చేశారు. పురుష సాధువులు నగ్నంగా తిరుగుతారని, అసభ్యంగా డాన్స్లు చేస్తారని మరి మహిళా సాధువులపై వివక్ష ఎందుకని ప్రశ్నించారు. అసలు ఈ బాబాలను, మాతాలను తయారుచేసిన భక్తులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆధ్యాత్మిక సమావేశాలలో రాధేమా అసభ్యంగా డాన్స్లు చేస్తున్నారని, తన భక్తులను కౌగలించుకోవటం, ముద్దుపెట్టుకోవటం, తనను ఇష్టమొచ్చినట్లు తాకనివ్వటం చేస్తున్నారని ఆరోపిస్తూ ముంబాయికి చెందిన ఫాల్గుణి అనే ఒక మహిళా న్యాయవాది కేసుపెట్టడాన్ని ఉద్దేశించి సోనూ నిగమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాళీ మాతను ఇంకా తక్కువ బట్టలలో చూపించారనికూడా సోనూ ఆరోపించారు.
కాళీ మాత అవతారంగా చెప్పుకునే రాధేమా కురచ దుస్తులలో ఉన్న ఫోటోలు, బాలీవుడ్ పాటలకు డాన్స్లు చేస్తున్న వీడియోలు లీక్ అవ్వటంతో గతనెలరోజులనుంచి ఆమె మీడియాలో కేంద్రబిందువయ్యారు. దీనితోబాటు ఆమెపై కట్నం వేధింపులు, ఆత్మహత్యలను ప్రోత్సహించటం, మూఢనమ్మకాలను ఎగదోయటం వంటి ఆరోపణలతో క్రిమినల్ కేసులుకూడా నమోదయ్యాయి. అయితే బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘయ్, భోజ్పురి నటుడు-లోక్ సభ ఎంపీ మనోజ్ తివారి, యాడ్ చిత్రాల దర్శకుడు ప్రహ్లాద్ కక్కర్, టీవీ స్టార్ రాఖీ సావంత్ రాధేమాను సమర్థిస్తూ ప్రకటనలు చేశారు. ఇప్పుడు సోనూ నిగమ్ వారికంటే ఒక అడుగు ముందుకెళ్ళిమరీ ఆమెను సమర్థిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంపై ఇప్పుడు దుమారం రేగుతోంది.