హీరోగా ఎన్నో సక్సెస్ సినిమాలను అందుకున్న శ్రీకాంత్ దశాబ్ద కాలంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నాడు. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారిపోయాడు. ఈ నేపధ్యంలో అయన హీరోగా మరోసారి తన లక్ ని పరీక్షించు కుందామని ‘టెర్రర్’ చిత్రం లో మాస్ హీరో గా నటించాడు.2006లో వచ్చిన ’హోప్’ అనే సినిమాతో జాతీయ అవార్డు పొందిన దర్శకుడు సతీష్ కాషెట్టి తన రెండో సినిమా ’కలవరమాయె మదిలో’ సినిమాతో నంది అవార్డ్ కూడా పొందాడు. ఇప్పుడు ‘టెర్రర్’ అంటూ తన మూడో సినిమాతో మన ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా అయినా శ్రీకాంత్ కు హీరోగా, కమర్షియల్ డైరెక్టర్ గా సతీష్ కాషెట్టి సక్సెస్ ను తెచ్చి పెడుతుందో లేదో ఈ రివ్యూ లో చూద్దాం. కథ: ఇండియాలో టెర్రరిజం అటాక్స్ అనేది జరుగుతుంటాయి. వాటిని ఆపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా…ఎక్కడో ఒక చోట బాంబ్ బ్లాస్ట్స్ జరుగుతూనే ఉంటాయి. ఆ బాంబ్ బ్లాస్ట్స్, టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమానే ఈ టెర్రర్. ఇక సినిమా అసలు కథలోకి వస్తే…. డిసిపి వి. రాథోడ్(వినయ్) టెర్రరిజం అటాక్స్ నుంచి సిటీ రక్షణ కోసం ఓ స్పెషల్ టీం ని సిద్దం చేస్తాడు .ఆ టీంలో మెయిన్ పర్సన్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సిఐ విజయ్(శ్రీకాంత్).నిజాయితీపరుడైన సిఐ విజయ్ కొన్ని కారణాల వల్ల సస్పెండ్ అవుతాడు. అదే కారణం వల్ల తండ్రికి కూడా దూరంగా ఉండే విజయ్, భార్యతో జీవనం సాగిస్తూంటాడు. ఇదిలా ఉంటే విజయ్‌కి ఒక కేసు ఇన్వెస్టిగేషన్ లో దొరికిన చిన్న క్లూ ద్వారా హైదరాబాద్ లో ఏదో పెద్ద అలజడి జరగబోతున్నదని తెలుసుకుంటాడు.ఇక విజయ్ అనుమానం ఉన్న వారి మీదంతా నిఘా వేస్తాడు. అలా ఒక టెర్రరిస్ట్ పర్సన్ తీసుకున్న స్టెప్ వలన విజయ్ కి ఓ భారీ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందని, దాని వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. అక్కడ నుంచి ఈ టెర్రరిస్ట్ అటాక్స్ ఆపడం కోసం, ఆ టెర్రరిస్ట్ లను పట్టుకోవడానికి విజయ్ ఏమి చేశాడు? మిగతా కథ అనేది తెరపై చూడాల్సిందే. నటీనటుల పెర్ఫార్మన్స్ : సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అత్రలో శ్రీకాంత్ అద్భుతంగా నటించాడు. రాజకీయపరమైన ఒత్తిడులకు ఇష్టం లేకున్నా తలొగ్గే పోలీస్ గా, తండ్రి పట్ల అమితమైన గౌరవం ఉన్న కొడుకుగా, వృత్తి పట్ల బాధ్యతతో పాటు… అపారమైన దేశభక్తి ఉన్న భారతీయుడిగా శ్రీకాంత్ విభిన్నమైన హావభావాలని ప్రదర్శించాడు . శ్రీకాంత్ భార్యగా నిఖిత నటన ఫరవాలేదు. హోం మినిష్టర్ గా కోట శ్రీనివాసరావు తనదైన శైలిలో నటించాడు. శ్రీకాంత్ అనుచరుడిగా రవివర్మ మంచి నటనను ప్రదర్శించాడు. ఇక పృధ్వీరాజ్ కామెడి విలన్ గా తనదైన టైమింగ్‌తో కట్టిపడేస్తాడు. నాజర్, విజయ్ చందర్ కూడా తమ స్థాయి నటనను ప్రదర్శించారు. సాంకేతిక విభాగం : టెక్నికల్ గా చెప్పుకోవాలంటే, ఈ సినిమాలో అందరికంటే ముందు దర్శకుడు సతీష్ కాషెట్టి గురించి చెప్పుకోవాలి. కథ ఎక్కడా ప్రక్కదారి పట్టకుండా స్క్రీన్ ప్లే ని రూపొందించుకున్నాడు దర్శకుడు.ఒక మంచి కథను స్పష్టంగా, సూటిగా చూపెడుతూ, ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ని కలపకుండా సినిమా చేయడం దర్శకుడి నిబద్ధతను తెలియచేస్తుంది. ఈ విషయం లో దర్శకుడిని అభినందించాలి. హైదరాబాద్ లో ఓ టెర్రర్ గ్రూప్ బాంబు పేలుళ్ళ కుట్ర పన్నారని తెలుసుకున్న పోలీస్ ఆఫీసర్ ఆ బాంబ్ బ్లాస్ట్ ను ఎలా చేదించాడు అనే కదాపరంగా అంత కొత్త కాన్సెప్ట్ కాకపోయినా, ఈ విషయం లో దర్శకుడిని అభినందించాలి. ముఖ్యంగా శ్రీకాంత్ నుంచి మంచి నటనను రాబట్టాడు. అలాగే ఈ సినిమాకి లక్ష్మి భూపాల్ రాసిన మాటలు చాలా బాగున్నాయి. శ్యామ్ ప్రసాద్ దుప్పటి సినిమాటోగ్రఫీ పరవా లేదు. కదను బట్టి నిర్మాణ విలువలు బాగున్నాయి, శ్రీ కాంత్ కి మార్కెట్ లేక పోయిన ధైర్యం తో ముందుకు వచ్చిన కొత్త నిర్మాతల్ని అభినందించాల్సిందే. విశ్లేషణ : పాత స్టొరీ లైన్ అయినప్పటికి, మొదటి పదినిముషాలు మినహా తరువాత నుంచి చివరివరకూ ఎక్కడా టెంపో తగ్గకుండా చూడటం ఈ సినిమాకు హైలైట్స్‌లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ముస్లిం అయిన టెర్రరిస్ట్ ని ఒక ముస్లిం పోలీస్ ఇంటరాగేట్ చేసే సీన్ లో వచ్చే మాటలు చాలా బావున్నాయి. ఈ సినిమాలో వచ్చే హైలైట్ సీన్స్ లో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. దర్శకుడు సతీష్ ఓ పవర్ ఫుల్ కథతో సినిమాని తెరకెక్కించాడు. టెర్రరిజం నేపధ్యంలో సాగే ఈ సినిమాలో శ్రీకాంత్ ను పోలీస్ ఆఫీసర్ గా దర్శకుడు చూపించిన తీరు బాగుంది. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు కథ ఎక్కడ కూడా పక్కకు సాగకుండా ఉంది. పోలీస్ పవర్ ఏంటో ఈ సినిమాలో దర్శకుడు చూపించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. ప్రేక్షకులకు తెలియని పలు పోలీస్ విభాగాల గురించి ఈ సినిమాలో దర్శకుడు చూపించాడు. కొత్తగా అనిపించిన ఈ సినిమాతో శ్రీకాంత్ కు మంచి పేరు తెచ్చి పెడుతుంది.బి ,సి సెంటర్స్ లలో బాగానే పే చేసే సినిమా అవుతుంది. తెలుగు360.కామ్ రేటింగ్: 2.5/5 బ్యానర్ : అఖండ భారత క్రియేషన్స్, నటీనటులు : శ్రీకాంత్, నిఖిత, కోట శ్రీనివాసరావు, నాజర్ తదితరులు, సంగీతం: సాయి కార్తీక్, సినిమాటోగ్రఫీ : శ్యామ్ ప్రసాద్ దుప్పటి మాటలు : లక్ష్మి భూపాల్, సమర్పణ : శ్రీమతి షేక్ కరిమా నిర్మాత: షేక్ మస్తాన్, దర్శకత్వం: సతీష్ కాషెట్టి, విడుదల తేది : 26.02.2016