దేశంలో పెద్ద నగరాలు, పట్టణాలలో మాత్రమే విద్యా, వైద్య, ఉపాధి అవకాశాలు ఉండటంతో అనేక దశాబ్దాలుగా గ్రామాల నుండి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంతవరకు దేశాన్ని, రాష్ట్రాలని పాలించిన ప్రభుత్వాలు ప్రజలను ఆకట్టుకొని ఓట్లు సంపాదించుకొనేందుకు ఏవో ఆకర్షణీయమయిన పేర్లతో పధకాలు ప్రకటించడమే తప్ప గ్రామాలను అభివృద్ధి చేసి వలసలు అరికట్టేందుకు గట్టి ప్రయత్నాలు చేయలేదు. ఈ సమస్యను గుర్తించి ప్రధాని నరేంద్ర మోడి దాని పరిష్కారానికి ‘రూర్బన్ మిషన్’ అనే ఒక వినూత్నమయిన పధకాన్ని ఈరోజు ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో డొంగర్ ఘడ్ అనే గ్రామంలో ప్రారంభించారు.
ఈ పధకం క్రింద దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 300 గ్రామాలను పట్టణాలతో సమానంగా అన్ని విధాల అభివృద్ధి చేస్తారు. ఆ విధంగా ఎంపిక చేసిన ఒక్కో గ్రామానికి ఆనుకొని ఉన్న నాలుగు గ్రామాలను కూడా అభివృద్ధి చేయబడతాయి. తద్వారా ఆ గ్రామాలకి చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాల ప్రజలు విద్యా, వైద్య, ఉపాధి వంటివాటి కోసం నగరాలకు వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఒక గ్రామం అన్ని విధాలా అభివృద్ధి చెందినట్లయితే ఆ ప్రభావంతో పరిసర గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి. కనుక దేశంలో మారుమూల గ్రామాలకు కూడా అభివృద్ధి వ్యాపించడం మొదలువుతుంది. తద్వారా గ్రామాలలో వెనుకబడిన వర్గాలు, నిరుపేదలు, రైతులు అందరూ ఆ అభివృద్ధి ఫలాలను అందుకోగలరు.
ఈ మొదటి సంవత్సరంలో కనీసం వంద గ్రామాలను అభివృద్ధి చేయాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోడి చెప్పారు. గతంలో యూపీఏ ప్రభుత్వం ఇదే ఉద్దేశ్యంతో ‘ప్రోవిజన్ ఆఫ్ అర్బన్ ఎమినిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్’ (పూర) అనే పధకాన్ని ప్రకటించింది కానీ దానిని ఆచరణలో పెట్టడంలో అశ్రద్ధ చూపింది. దాని స్థానంలోనే మోడీ ప్రభుత్వం ఈ రూర్బన్ మిషన్ పధకం ప్రవేశ పెట్టింది. సుమారు ఏడాదిపాటు దీనిపై లోతుగా అధ్యయనం చేసిన తరువాత అన్ని ఏర్పాట్లు చేసుకొని ఈ పధకం ప్రారంభించారు. కనుక ఇది విజయవంతం అవుతుందనే ఆశిద్దాము.