కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం . విజయా డెయిరీ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్దన్ రావు ఎన్నికయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత చైర్మన్ చలసాని ఆంజనేయులు ఐదేళ్లుగా పదవిలో ఉన్నారు. ఆయన రాజకీయంగా పదవి పొందినా తరవాత పదవి కోసం వైసీపీతో రాజీ చేసుకున్నారన్న అనుమానం టీడీపీ వర్గాల్లో ఉంది. దానికి తగ్గట్లుగానే ఆయన ఐదేళ్లలో పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పెద్దగా పాల్గొనలేదు. పైగా ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై .. వైసీపీ నేతలతో కలిసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఇటీవల యార్లగడ్డ వెంకట్రావు చలసానిపై మండిపడ్డారు. వల్లభనేని వంశీతో టచ్ లో ఉంటూ… సాక్షి ద్వారా తనపై తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎందుు బయటకు రాలేదని.. ఎన్నికల్లో ఎందుకు ప్రచారం చేయలేదని ప్రశ్నించారు. దీనిపై చలసాని కూడా స్పందించారు. తాను టీడీపీ కోసమే పని చేశానని చెప్పుకొచ్చారు. కానీ ఆయన డబుల్ గేమ్ ఆడారని కృష్ణా జిల్లాలో టీడీపీ నేతలందరికీ క్లారిటీ ఉంది. అందుకే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయనతో రాజీనామా చేయించాలని ఆదేశించినట్లుగా చెబుతున్నారు.
చంద్రబాబును కలిసి ఓ సారి తన వాదన వినిపించి రాజీనామా చేయాలని చలసాని ఆంజనేయులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో ముగ్గురు డైరక్టర్ల ఎన్నిక విషయంలోనూ ఆయన ఒంటెద్దు పోకడలకు పోయారు. ఇప్పుడు కూడా డైరక్టర్లందరి మద్దతు తనకే ఉందని ఆయన అంతర్గతంగా చెబుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పాలబూత్లను కూడా వైసీపీ వారికే కేటాయించారు. అదేమంటే.. విజయాడైరీతో రాజకీయాలతో సంబంధం లేదని.. ఆయన చెబుతున్నారు. మరి వైసీపీ వాళ్లకు ఎందుకిచ్చారంటే.. ఆయన వద్ద సమాధానం లేదు.
మొత్తంగా పదవిని కాపాడుకోవడానికి వంశీతో సన్నిహితంగా ఉండి.. ఐదేళ్లు పార్టీ కి ఎలాంటి పనులు చేయలేదు. పైగా ఇప్పుడు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అందుకే తొలగింపు ఖాయమని తెలుస్తోంది.