కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ఉన్న గోరోజనం ఇంకా ఏమాత్రం తగ్గలేదు. చింత చచ్చినా పులుపు చావలేదన్న సామెత చందంగా వీరు వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఆ పార్టీ పూర్తిస్థాయిలో కుదేలైపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అందరూ గుర్తిస్తున్నదే. ఆ పార్టీకి ప్రస్తుతం దిక్కులేదు. ఇకపై భవిష్యత్తు లేదు.. అన్నట్లుగానే పరిస్థితి ఉంది. అయినా సరే.. ఆ పార్టీ నాయకులు మాత్రం పెత్తనం తమ చేతిలోనే ఉండాలని కోరుకుంటున్నారు. తమను పతనం చేసిన ప్రత్యర్థి భాజపాను చిన్నపార్టీలు అందరూ కలిసి ఓడిస్తే.. అంతిమంగా తాము తప్ప ఈ దేశానికి గతిలేని పరిస్తితి వస్తుందని కలలు కంటున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఆరెస్సెస్ రహిత భారత దేశాన్ని నిర్మించడం గురించి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆరెస్సెస్ ను దేశంనుంచి తరిమి కొట్టేందుకు అంటే భాజపా ప్రాభవాన్ని జీరో చేసేందుకు భాజపాయేతర పార్టీలన్నీ ఒక తాటిమీదకు రావాలని నితీశ్ అంటున్నారు.
కాంగ్రెసు పార్టీకి నితీశ్‌కుమార్ డైలాగు మాత్రం మహా రుచికరంగానే ఉంది. అయితే ఈ యజ్ఞానికి పూనిక వహిస్తున్న నితీశ్ జాతీయ స్థాయి నాయకుడు కావడం అనే విషయాన్ని మాత్రం వారు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఇలాంటి కూటమి ఊహాజనితం.. 2019 ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలే ఓడించి మాకు అధికారం ఇవ్వబోతున్నారు… అంటూ కాంగ్రెస్ నాయకులు కలలు కంటున్నారు.
నితీశ్ చెబుతున్న ఆరెస్సెస్ రహిత భారత దేశం మాత్రం వారికి కావాలి.. కానీ నితీశ్ నాయకత్వం మాత్రం వద్దుట! ఈ దేశానికి తాము తప్ప మరో గత్యంతరం లేదని.. కాంగ్రెసు అత్యాశ. చిన్న పార్టీల జాతీయ కూటమిలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు కాంగ్రెసు చేయగలదు కానీ.. మళ్లీ పెత్తనం దక్కుతుందనుకుంటే మాత్రం భ్రమేఅని పలువురు అంటున్నారు.