ఏపీలో వాలంటీర్ల కొనసాగింపు విషయంలో పీటముడి వీడటం లేదు. ఓ మంత్రికి ప్రత్యేకంగా బాధ్యతలను అప్పగించడంతో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందన్న నమ్మకం ఏర్పడింది కానీ , ఎంతమందిని కొనసాగిస్తారు..? ఎంతమందికి ఉద్వాసన పలుకుతారు..? అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉండగా…అందులో లక్ష మందికి పైగా ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున ప్రచారం చేసేందుకు వీలుగా ఆ పార్టీ నేతల ఒత్తిళ్లతో వాలంటీర్లు రీజైన్ చేశారు. ప్రభుత్వం మారడంతో వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.
కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తుందన్న వైసీపీ విమర్శలకు ధీటుగా తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామన్న చంద్రబాబు…వేతనాలను పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే వాలంటీర్ వ్యవస్థ బాధ్యతలను ప్రత్యేకంగా ఓ మంత్రికి అప్పగించడంతో వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై క్లారిటీ వచ్చినట్లు అయింది. వేతనం పెంపుపై కూడా త్వరలోనే ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకోనుంది.
అయితే, వైసీపీ హయాంలో పదో తరగతి ఉత్తీర్ణతతోనే వాలంటీర్లను నియమించుకున్నారు. ఇప్పుడు మాత్రం వాలంటీర్ ఉద్యోగానికి డిగ్రీ అర్హత ఉన్న వారినే ఎంపిక చేయాలని కొత్త ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ హాయాంలో నియామకమైన వాలంటీర్లకు సైతం డిగ్రీని అర్హతగా ఫిక్స్ చేసి… ఏరివేతలు షురూ చేస్తారా..? అనేది త్వరలో క్లారిటీ రానుంది.