వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. నిన్నామొన్నటిదాకా ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఈసీకీ పదే పదే ఫిర్యాదులు చేయించి.. తమకు ఉన్న పలుకుబడితో ఆయనను బదిలీ చేయించింది. ఆ తర్వాత కూడా ఆయనను వదిలి పెట్టలేదు. బదిలీ అయినప్పటికీ.. ఇంటిలిజెన్స్ పోలీసులు ఆయనకే రిపోర్ట్ చేస్తున్నారంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆధారాలు లేకపోవడంతో..కోర్టు తోసిపుచ్చింది. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా… వైసీపీ నేతలు.. ఏబీ వెంకటేశ్వరరావును టార్గెట్ చేస్తూండటం.. అదే పనిగా ఆరోపణలు చేస్తూండటంతో ఆయన అసహనానికి గురయ్యారు. విజయసాయిరెడ్డిపై పరువు నష్టం దావా దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. విజయసాయిరెడ్డి చేసిన నిరాధార వ్యాఖ్యలపై.. పరువు నష్టం దావా వేస్తానని ఏబీ వెంకటేశ్వరరావు మీడియాకు తెలిపారు.
తనపై నిరాధార, హేయమైన ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఈసీ ఆఫీస్ ముందు మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. నాకు కాంట్రాక్ట్లు ఉన్నాయని ఆరోపించారన్నారు. ప్రభుత్వ ఏజెన్సీలు, సబ్ కాంట్రాక్టర్లతో.. నాకు, మా కుటుంబ సభ్యులకు సంబంధాలు లేవని ప్రకటించారు. నిరాధారమైన ఆరోపణలు చేసినవారిపై పరువునష్టం దావా వేస్తానని తెలిపారు. అధికారంలోకి వస్తామంటూ.. వైసీపీ నేతలు ఇప్పటికే కొంత మంది అధికారులపై బ్లాక్ మెయిలింగ్ తరహా.. వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఏబీ వెంకటేశ్వరరావు.. వారిపై పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించడం ద్వారా…కలకలం రేపారు. ఏబీ వెంకటేశ్వరరావు.. ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉండేవారు. అయితే.. ఆయన పై.. వైసీపీ నేతలు మొదటి నుంచి గురి పెట్టారు.
తమ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి ఆయన కారణమని కూడా ఆరోపణలు గుప్పించారు. బీజేపీతో ఉన్న సన్నిహిత సంంబధాలు.. ఈసీ దగ్గర ఉన్న పలుకుబడితో… ఎన్నికల నిర్వహణతో.. ఆయనకు ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా.. బదిలీ చేయించగలిగారు. ఆ తర్వాత కూడా ఆరోపణలు ఆగకపోవడంతో… పరువు నష్టం దావాకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితి.. ముందు ముందు అధికారులు, పార్టీల మధ్య పెరగనున్న అంతరానికి కారణం కానుందన్న అభిప్రాయం ఏర్పడుతోంది.