గోదావరి పుష్కరాల మొదటి రోజు పుష్కరాలరేవు వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన సిసి కెమెరాల్లోని ఫుటేజీలు కనిపించడం లేదట. ఈదుర్ఘటనలో 28 మంది మరణించిన సంగతి తెలిసిందే.(అదేరోజు 27 మంది చనిపోయారు. ఆసంఘటలనో చాతిఎముకలు విరిగి హాస్పిటల్ లో వెంటిలేటర్ పై వున్న 80 ఏళ్ళ వృద్ధురాలు 14 వరోజున మరణించింది)
రిలయెన్స్ జియో సంస్ధ పుష్కరాలకోసం రాజమండ్రి అంతటా ఆప్టిక్ ఫైబర్ కేబులు వేసి హైస్పీడు ఇంటర్నెట్ తో 171 సిసి కెమేరాలను లింక్ చేసి పుష్కరఘాట్ వద్ద సెంట్రల్ కంట్రోల్ రూమ్ కి కనెక్ట్ చేసింది. పోలీసు ఉన్నతాధికారులేకాక , రెవిన్యూ అధికారులు, మంత్రులు, స్వయంగా ముఖ్యమంత్రి అక్కడినుంచే పరిస్ధితిని గమనిస్తూ సూచనలు ఇచ్చేవారు.
అయితే తొక్కిసలాట జరిగిన సమయంలో సిసి కెమెరాల్లోని దృశ్యాలు పోలీసులకు లభించకపోవడం గమనార్హం. ఆరోజు విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల సిసి కెమెరాల్లోని దృశ్యాలు నమోదు కాలేదని చెబుతున్నారు. ఈవిషయంపై కూడా పోలీసులు ఆరా తీయగా ఆసమయంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేదని విద్యుత్ శాఖస్పష్టం చేసింది. దీంతో ఆరోజు సిసి కెమెరా ఫుటేజీల అదృశ్యానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఆ రోజు పుష్కరాలరేవు వద్ద బారికేడ్లలో ఎవరో పెద్దగా కేకలువేశారని అది అక్కడ కిక్కిరిసి వున్న యాత్రికుల్లో భయాందోళనలు కలిగించిందనీ కొంతమంది యాత్రికులు పుష్కరాలరేవు కంట్రోల్‌రూమ్ వద్ద పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. అలాగే గోదావరి రైల్వేస్టేషన్ వద్ద విద్యుత్ వైర్లు తెగిపడినట్లు ప్రచారం జరిగినట్లు కూడా పోలీసుల దృష్టికి వచ్చింది ఈతప్పుడు ప్రచారాలకు కారణం ఉద్దేశ్యపూర్వకంగా ప్రజలను భయపెట్టడమా లేక ఆకతాయితనమా అనికూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
ముఖ్యమంత్రితో సహా పలువురు విఐపిలు వున్న పుష్కరఘాట్ వద్ద ఆసమయంలో గాలిలో సంచరిస్తూ వీడియోతీసే డ్రోన్ కెమేరాను డిజిపి స్వయంగా సూచనలిస్తూ పక్కనే వున్న ఆపరేటర్ తో రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపించారు. ఒకదశతరువాత అందులో ఏమీ రికార్డుకాలేదని, ఎవరైనా పైకి ఎగిరి ఏటవల్ తోనో డ్రోన్ ని కొట్టి వుంటారా అని ఒక ఉన్నతాధికారి అన్నారు.
వీడీయో ఫుటేజి తప్పనిసరిగా క్లూలు దొరికి వుండేవి. అవేమీలేకపోవడాన్ని బట్టి ఇందులో ఏదైనా విద్రోహ చర్య వుందా అన్న అనుమానం బలపడుతోంది.
ఉన్నత స్ధాయి అధికారులతో విచారణ జరిపించగలమని సంఘటన జరిగిన వెంటనే ప్రకటించిన ముఖ్యమంత్రి ఆసాయంత్రమే న్యాయ విచారణ చేయించగలమని ప్రకటించారు. ఇంతవరకూ ఏ విచారణో నిర్ణయమే జరగలేదు. సంఘటన తరువాత జరిగిన రెండు కేబినెట్ మీటింగ్ లలోనూ మరణించిన వారికి సంతాపం ప్రకటించడమే తప్ప విచారణపై ఏనిర్ణయాన్నీ ప్రకటించలేదు.
దాదాపుగా రాష్ట్రప్రభుత్వం యావత్తూ వున్న సమయంలో జరిగిన దుర్ఘటనపై దర్యాప్తు ముందుకి సాగాలంటే ముఖ్యమంత్రో, మంత్రో, డిజిపి నో ”గో ఎహెడ్ ” అంటేతప్ప తమకు తాము చొరవతీసుకుని దర్యాప్తు సాగించడం జిల్లా స్ధాయిలో పోలీసు అధికారుల వల్ల అయ్యేపని కాదని దిగువస్ధాయి పోలీసు వర్గాలు చెబుతున్నాయి.