ఈవారం బాక్సాఫీసు దగ్గర ముక్కోణపు పోటీ చూడబోతున్నారు తెలుగు సినీ ప్రియులు. లై, జయ జానకి నాయక, నేనే రాజు – నేనే మంత్రి విడుదలకు సిద్ధమయ్యాయి. ఒకే రోజు మూడు సినిమాలంటే ఇబ్బంది పడాల్సొస్తుందని, ఒక సినిమాని ఒకరోజు ముందుకు తీసుకురావాలని సురేష్ బాబు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. జయ జానకి నాయక ఒక రోజు ముందే అంటే 10న వస్తుందని ప్రచారం సాగింది. అయితే.. ఒక రోజు ముందు రావడానికి బోయపాటి శ్రీను ససేమీరా అనడంతో… జయ జానకి నాయక కూడా 11నే వస్తోంది. ఆఖరికి ‘లై’ సినిమాని ఓ వారం రోజులు ఆపాలని కూడా సురేష్ బాబు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. కానీ.. 14 రీల్స్ సంస్థ కూడా అందుకు అంగీకరించలేదని, తప్పని పరిస్థితుల్లో ఈనెల 11న మూడు సినిమాలూ పోటీకి సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. ప్రమోషన్ పరంగా ‘జయజానకి నాయక’ ముందు వరుసలో ఉంది. ‘లై’ ఇప్పుడిప్పుడే ప్రచార పర్వం ప్రారంభించింది. ఈరోజు నుంచి ‘నేనే రాజు నేనే మంత్రి’ ప్రమోషన్లు మొదలయ్యాయి. ఒకే రోజు రానా ఏకంగా 18 ఇంటర్వ్యూలు ఇచ్చాడట. సాధారణంగానే రానాకి ప్రమోషన్లంటే క్రేజ్. పైగా సొంత సినిమా. అందుకే ఈ స్థాయిలో తన సినిమాని ప్రమోట్ చేసుకొంటున్నాడు. ‘లై’ విజృంభించాల్సివుంది.