శ్రీలంక మాజీ అద్యక్షుడు మహీంద్ర రాజపక్ష తాజా ఓటమికి మూలకారణం ఆయన విదేశాంగ విధానం సింహళీయులకు నచ్చకపోవడమేనని దక్షిణాసియా దేశాల దౌత్యవర్గాలను ఉటంకిస్తూ విశ్లేషణలు వెలువడుతున్నాయి. శ్రీలంక భారత్ ల మధ్య తరతరాలుగా వున్న సాంస్కృతిక మైత్రీ సంబంధాలు రాజపక్ష హయాంలో ఆయన అనుసరించిన వైఖరివల్ల దెబ్బతిన్నాయి.
రాజపక్ష శ్రీలంక దేశాధ్యక్షుడి వున్నపుడు తమిళ ఈలం లిబరేషన్ టైగర్స్- (ఎల్టిటిఇ)ఉగ్రవాద సంస్థ దాదాపు అంతరించిపోయింది. శ్రీలంక ఉత్తర ప్రాంతం తమిళపులుల నుంచి విముక్తమైంది. ఎల్టిటిఇ విధ్వంసమైన తరువాత ఉభయ దేశాల సంబంధాలు మెరుగు పడకపోగా క్షీణించిపోయాయి.ఎల్టిటిఇకి వ్యతిరేకంగా శ్రీలంక ప్రభుత్వం జరిపిన పోరాటాన్ని శ్రీలంకలోని సామాన్య తమిళులపై జరిగిన దమన కాండగా కొన్ని తమిళనాడు రాష్ట్రంలో ద్రవిడ పార్టీలు భావిస్తున్నాయి. ఈ ప్రభావం శ్రీలంక, భారత్ లమధ్య దూరం పెరగడానికి ఒక కారణం. 2012లోను 2013లోను ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావనకు వచ్చిన శ్రీలంక వ్యతిరేక తీర్మానాన్ని భారత్ సమర్ధించడం రాజపక్ష దూరంగా జరగడానికి మరో కారణం.
తీర్మానాన్ని వ్యతిరేకించడం ద్వారా చైనా ప్రభుత్వం శ్రీలంకకు సన్నిహితం కావడానికి ప్రయత్నించింది. శ్రీలంకలోని ఓడరేవులను ఆధునీకరించే పనిని చైనా చేపట్టింది. ఆ నౌకాశ్రయాలను భారత వ్యతిరేక యుద్ధ స్థావరాలుగా మార్చడానికి చైనా ప్రయత్నించిందన్న అనుమానం దౌత్యవర్గాల్లోనే మాత్రమేకాక శ్రీలంక ప్రజల్లో కూడా వ్యాపించింది. కల్చరల్ కంపేటబిలిటీ వల్ల భారత్, శ్రీలంకలు సహజమిత్రులు. ఈ మైత్రిని భగ్నం చేస్తున్నాడన్న ఆదేశపు ప్రజల అనుమానం రాజపక్ష ఓటమికి ముఖ్యకారణమని విశ్లేషిస్తున్నారు.
భారత్ దౌత్యసంబంధాల్లో, చైనా దురాక్రమణకు హిందూ మహాసముద్రంలో స్దావరాలను విస్తరించకుండా నిలువరించడంలో రాజపక్ష పరాజయం అతి ముఖ్యమైన పరిణామం.
యునైటెడ్ ఫ్రీడమ్ పార్టీ నాయకుడైన రాజపక్ష దేశాధ్యక్షుడుగా వున్నసమయంలో గత జనవరిలో జరిగిన ఎన్నికల్లో రెండోసారి అధ్యక్షపదవికి పోటీ చేసి ఓడిపోయారు. తిరుగుబాటు చేసిన అదేపార్టీ ప్రముఖుడు మైత్రీపాల శ్రీసేన ప్రతిపక్షాల మద్దతుతో దేశాధ్యక్షుడిగా ఘనవిజయం సాధించాడు. ఏడునెలల తరువాత పార్లమెంటుకి జరిగిన ఎన్నికల్లో మాజీ దేశాధ్యక్షుడైన రాజపక్ష ప్రధానమంత్రి అభ్యరిగా నిలబడ్డారు. దేశాధ్యక్షునిగా పని చేసిన వారు దేశ ప్రధానిగా పోటీకిదిగడంలో ఔచిత్యం గురించి దేశవ్యాప్తంగా చర్చజరిగింది. రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ ఆతరువాత ప్రధాని అయిన చరిత్రను ఉదాహరిస్తూ రాజపక్ష తనను తాను సమర్ధించుకున్నారు.
అయినా 17 న జరిగిన ఎన్నికల్లోఆయన పార్టీకి తక్కువస్ధానాలు లభించడంతో ప్రస్తుత ప్రధానమంత్రి, యునైటెడ్ నేషనల్ పార్టీ నాయకుడు అయిన రనిల్ విక్రమసింహ మళ్ళీ ప్రధానమంత్రిగా ఎన్నికవుతున్నారు.