సైకిల్ గుర్తుపై గెలిచి తెరాస ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస యాదవ్ ను అనర్హుడిగా ప్రకటించాలనే టీడీపీ పట్టుదల, రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. ఇది తలసానికి తలనొప్పి వ్యవహారంగా కనిపిస్తోంది ఒకవేళ, ఆయన్ని అనర్హుడిగా స్పీకర్ ప్రకటిస్తే సనత్ నగర్లో ఉప ఎన్నికను ఎదుర్కోవాలి. మరి ఖాయంగా గెలుస్తారా అనేదే ప్రశ్న.
మరోవైపు, టీడీపీ దూకుడుగా ముందుకు పోతోంది. పార్టీ టికెట్ కోసం చాలా మందే పోటిపడ్డా, ఒక్కరికి ఖాయమనే టాక్ తో మిగతా వారు వెనక్కి తగ్గారు. అయితే, ఎవరికి టికెట్ ఇచ్చినా సత్తా చాటాలనే కసి తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది. ఇటీవలి పరిణామాలు, కేసీఆర్ వ్యాఖ్యలు, మంత్రుల మాటలతో టీడీపీ కేడర్ తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ కసి తెరాస కేడర్ లో కనిపించడం లేదు. అధికార పార్టీగా కాస్త కడుపునిండిన వ్యవహారంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలిచాం కాబట్టి ఇంకా కష్టపడటం ఎందుకనేదే ఎక్కువ మంది గులాబీ నాయకులు, కార్యకర్తల ఉద్దేశంలా కనిపిస్తోంది.
తలసారి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ చిన్నదేం కాదు. ఏ ధైర్యంతో ఆయన అంత పెద్ద చాలెంజ్ చేశారనేది చర్చనీయాంశమైంది. సనత్ నగర్లో తలసాని ఎట్టి పరిస్థితుల్లో గెలవరనేది టీడీపీ గట్టి నమ్మకం. దీనికి అనేక కారణాలు చెప్తున్నారు. మొదటిది, సీమాంధ్ర ఓటర్లు. 2014ను మించి ఈసారి సీమాంధ్ర ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తారని తమ్ముళ్లు చెప్తున్నారు. ఇటీవలి రాజకీయ పరిణామాలే అందుకు కారణమని వారు చెప్తున్నారు. అలాగే, టీడీపీకి బలమైన కేడర్ ఉంది. గణనీయమైన ఓటు బ్యాంక్ ఉన్న బీజేపీ అండ ఎలాగూ ఉంది.
మరోవైపు, తెరాస హైదరాబాదులోని చాలా చోట్ల ఇంకా బలం పుంజుకోలేదు. బూత్ స్థాయి నెట్ వర్క్ లేదు. గ్రేటర్ కన్వీనర్ మైనంపల్లి హన్మంత రావు మాత్రం పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు సిటీ నేతలు ఆయనకు మద్దతిస్తున్నారు. కానీ చాలా మంది నాయకులు అధికార పార్టీ నేతలుగా హవా చెలాయించడం తప్ప, కష్టపడటానికి ఇష్టపడటం లేదు. ఇది కూడా తలసానికి మైనస్ పాయింట్ కావచ్చు. నగరంలో భారీగా విస్తరించాలని మజ్లిస్ పార్టీ గట్టు పట్టుదలతో ఉంది. ఒక వేళ సనత్ నగర్ ఉప ఎన్నికల్లో అది గనక పోటీ చేస్తే గణనీయంగా ఓట్లను పొందవచ్చు. అది తెరాసకు నష్టం కలిగించ వచ్చనేది కూడా టీడీపీ శిబిరం అంచనా. ఇన్ని కారణాలున్నాయి కాబట్టే, తలసాని గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ఎర్రబెల్లి ప్రకటించారట. ఈ ఫలితం ప్రభావం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపైనా పడవచ్చు. గ్రేటర్ లోనూ తమదే హవా అని టీడీపీ, బీజేపీ నమ్మకంతో ఉన్నాయి. తెరాస కూడా గెలుపు మీద ధీమాను ప్రకటిస్తోంది. చివరకి ఎవరి నమ్మకం నిజమవుతుందో చూద్దాం.