తెలుగు సినిమా పాటల రారాజు, సాహితీ చక్రవర్తి సిరివెన్నెల సీతారామశాస్త్రికి పద్మశ్రీ పురస్కారం వరించింది. రిపబ్లిక్ డేని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా.. పద్మ పురస్కారాల్ని ప్రకటించే సంగతి తెలిసిందే. తెలుగు నుంచి.. పద్మశ్రీ జాబితాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి కి చోటు దక్కింది. `సిరివెన్నెల`తో పాటల ప్రస్థానం ఆరంభించారు సీతారామశాస్త్రి. అప్పటి నుంచీ ఆయన పేరు సిరివెన్నెల సీతారామశాస్త్రి అయిపోయింది. ఎన్నో చిత్రాలకు తనదైన శైలిలో పాటల్ని అందించి.. నంది అవార్డులు సొంతం చేసుకున్న సీతారామశాస్త్రికి మరెన్నోసార్లు జాతీయ పురస్కారాలు తృటిలో తప్పిపోయాయి. దాంతో ఆయనచాలాసార్లు మీడియా ముందే తన ఆవేదన వెళ్లగక్కేవారు. `జాతీయ అవార్డుల ఎంపికకు కొలమానం ఏమిటి?` అని నేరుగా ప్రశ్నించిన సందర్భాలున్నాయి. ఎట్టకేలకు ఆయన ప్రతిభకు తగిన గుర్తింపు దక్కినట్టే.