ప్రత్యేక హోదా వ్యవహారాలను ఢిల్లీలో మానిటర్ చేస్తున్న కేంద్రమంత్రి సుజనా చౌదరి వైఫల్యం కారణంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమన పరిస్ధితులు ఏర్పడ్డాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చికాకు పడ్డారని ఆపార్టీ వర్గాలు గట్టిగా చెప్పుకుంటున్నాయి. “కేంద్రంలో ఏంజరుగుతూందో తెలుసుకోలేని పరిస్ధితుల్లో సుజనా వున్నాడు. ఈ ఫెయిల్యూర్ చాలా ఇబ్బందిగా వుంది. విషయం ముందే తెలిసి వుంటే కేంద్రం నుంచి హోదా సాధ్యం కాదనే ప్రకటన రాకుండా హాండిల్ చేసేవాళ్ళం,” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినపుడు నలుగురు మంత్రులు ఉన్నారు.
ప్రత్యేక హోదా వ్యవహారాలపై సుజనా చౌదరి శాతాలవారీగా ప్రగతిని వివరించేవారు. ఆయన మొత్తం ఆరుసార్లు హోదా వస్తోందని మీడియాకు చెప్పారు. హోదాకు అర్హతలు అనుకూలతలను ఎస్టాబ్లిష్ చేయడానికి డాక్యుమెంటేషన్, ఫైలింగ్ జరుగుతోందని 60 శాతం పని అయ్యిందని, ఒక నెలలో హోదా ప్రకటన జరిగే అవకాశం వుందని ఈ మధ్యే సుజనా మీడియాకు చెప్పారు.
ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఇచ్చే పరిస్ధితే లేదని ప్రణాళికా శాఖ మంత్రి ఇంద్రజిత్ సింగ్ రెండోసారి కూడా పార్లమెంటులో ప్రకటించాక స్వయంగా చంద్రబాబే కేంద్ర ఆర్ధిక, హోం మంత్రులతో, చివరిగా ప్రధానమంత్రితో కూడా ఫోన్ లో మాట్లాడారు. త్వరలో ఈ విషయాల మీద చర్చిద్దామని ప్రధాని బదులిచ్చారు.
ఆ తరువాత సుజనా చౌదరి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, హోదా వస్తుందని అంతకంటే ముందే, ఈనెలాఖరుకి ప్రత్యేక పేకేజి వస్తుందని చెప్పారు. ఇది జరిగిన అరగంటలోపలే ముఖ్యమంత్రి స్పందించి సుజనాచౌదరికి అవగాహన లేదని విషయాన్ని ముగించారు. దీంతో నొచ్చుకున్న సుజనా చౌదరి “అన్నీ ఆయన చెప్పినట్టే చేశాను,” అని వ్యాఖ్యనించారని తెలిసింది.
కేంద్రం చెబుతున్నది ఒకటి, చేసింది మరొకటి. లోపలి పరిణామాలను సుజనాతో సహా తెలుగుదేశం వాళ్ళెవరూ గమనించలేకపోయారని ఇది మనవాళ్ళ ఫెయిల్యూర్ అని కూడా చంద్రబాబు అన్నారు.