హైదరాబాద్: హైదరాబాద్ నగర శాంతిభద్రతల అధికారం గవర్నర్‌కు ఉండాలని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 8లో పేర్కొనటం కేవలం కంటితుడుపుచర్యమాత్రమే అని కేసీఆర్ వ్యాఖ్యానించటాన్ని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. మంత్రి మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, సెక్షన్ 8 చెల్లకపోతే విభజనచట్టమూ చెల్లదని అన్నారు. సెక్షన్ 8లోని ముఖ్యాంశాలను ఆయన చదివి వినిపించారు. కేసీఆర్‌ది ద్వంద్వనీతి అంటూ దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు సోమవారం హైదరాబాద్‌లో ఇందిరాపార్క్‌వద్ద చేసిన దీక్షను ఉమామహేశ్వరరావు పరిహసించారు. వైఎస్ నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు వందలకోట్లరూపాయలు దోచుకున్నారని, ఆ సొమ్మునంతా కక్కిస్తామని అన్నారు. డిపాజిట్లు కోల్పోయిన వీరంతా సిగ్గులేకుండా చంద్రబాబును విమర్శిస్తున్నారని అన్నారు. సోనియా, జగన్, కేసీఆర్ కుమ్మక్కై రాష్ట్రాన్ని విభజించారని ఆరోపించారు.