కటక్ : ఒడిషాలో తీవ్ర వివాదాస్పదుడైన సారథి బాబాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్స్ స్కాండ్ తో అపఖ్యాతిపాలు కావడమే కాదు, మోసం, కుట్రపూరిత వ్యవహార శైలితో ఈ బాబా వివాదాల్లో చిక్కుకున్నాడు. ముఖ్యంగా ఇటీవల హైదరాబాదులోని ఓ హోటల్లో 21 ఏళ్ల మహిళతో రెండు రోజులు గడిపాడంటూ ఓ ఒరియా ఛానల్ కథనాన్ని ప్రసారం చేసింది. అసలే బాబా వైఖరిపై కోపంతో ఉన్న ప్రజలు ఈ కథనంతో వీధుల్లోకి వచ్చారు.
కేంద్ర పారాలోని బాబా ఆశ్రమం ముందు నిరసన ప్రదర్శనలుచేశారు. బాబాను అరెస్టు చేసే వరకూ ఆశ్రమం ముందు నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చుకున్నారు. అటు బాబా అనుచరులకు, స్థానికులకు మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. 144 సెక్షన్ విధించారు. అయినా స్థానికులు మాత్రం నిరసన కొనసాగించారు.
దీంతో పరిస్థితి తీవ్రతను గమనించిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తక్షణం విచారణ జరిపి తగిన చర్య తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. శుక్రవారం నాడు కేంద్ర పారాలో ఉద్రిక్తత కొనసాగింది. దీంతో క్రైం బ్రాంచ్ పోలీసులు శనివారం నాడు సారథి బాబాను అదుపులోకి తీసుకుని కటక్ తరలించారు. ఆయనపై వచ్చిన అభియోగాలకు సంబంధించి విచారించారు. సుదీర్ఘ విచారణ తర్వాత బాబాను అరెస్ట్ చేశారు. మోసం, కుట్రపూరితంగా వ్యవహరించడం, అక్రమ సంబంధం, ఆయుధ చట్టం, ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరో్ధక చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేశారు. బాబాను కోర్టులో హాజరు పరిచిన తర్వాత, ఆయన్ని విచారించడానికి ఐదురోజులు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. ఆయనపై వచ్చిన అభియోగాలకు ఆధారాలు సంపాదించాలంటే విచారణ అవసరమని అధికారులు కోర్టుకు విన్నవించారు.
గత కొన్ని రోజులుగా సారథి బాబా వ్యవహారం శాంతిభద్రతల సమస్యగా మారింది. అటు బాబా వ్యవహారంపై ఆందోళనలు, ఇటు మద్దతుదారుల సమర్థనలతో ఏ క్షణం ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ కొనసాగింది. మతం పేరుతో ప్రజలను మోసగించే వాడిని కఠినంగా శిక్షించాలంటూ పలు సంఘాలు ఆందోళన ముమ్మరం చేశాయి. చివరకు సారథి బాబా అరెస్టుతో కేంద్ర పారాతో పాటు ఒడిషాలో ప్రశాంత వాతావరణం ఏర్పడింది.