పెద్ద సినిమా వస్తోందంటే శాటిలైట్ హక్కుల కోసం పోటీ మొదలైపోతుంది. మాటీవీ, జెమినీ, జీ తెలుగు… ఫ్యాన్సీ రేట్లతో ఆఫర్లు ఇస్తుంటారు. పవన్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలకైతే.. ఆ డిమాండ్ మరో రేంజులో ఉంటుంది. సినిమా విడుదలకు ముందే… శాటిలైట్ రేటు ఫిక్సయిపోతుంటుంది. సర్దార్ హైప్ చూసి.. ఛానళ్లన్నీ కదిలివచ్చాయి. ఇదివరకటి పవన్ సినిమాలకు మించి ఇస్తానంటూ బేరం పెట్టాయి. అయితే… ఈ బేరాలాటలో మా టీవీ గెలిచింది. ఏకంగా రూ.12.5 కోట్లకు సర్దార్ శాటిలైట్ సొంతం చేసుకొంది. బాహుబలి తరవాత.. శాటిలైట్ హక్కుల్లో సర్దార్దే రికార్డు.
అయితే ఇప్పుడు ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. పవన్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు టీవీల్లో వేస్తే ఎవరు చూస్తారు? కనీస రేటింగులు కూడా రావు. దాంతో.. ‘మా’ తలపట్టుకొంటోంది. పవన్ క్రేజ్‌ని నమ్మి.. పన్నెండు కోట్లు పెట్టినందుకు తనని తాను నిందించుకొంటోంది. అడ్వాన్సులు ఎలాగూ ఇచ్చేశారు కాబట్టి.. ‘రేటు తగ్గే మార్గముందా’ అంటూ నిర్మాత శరత్ మరార్తో మంతనాలు మొదలెట్టింది. శరత్.. ఎందుకు రిబేటు ఇస్తారు. ‘వచ్చే సినిమా కూడా మా బ్యానర్లోనే కదా.. అప్పుడు చూద్దాం లెండి’ అంటున్నాడట. అలా.. సర్దార్ని నమ్మి మోసపోయినవాళ్లలో మా టీవీ కూడా చేరిపోయింది.