ఉగ్రవాదం ఉరుముతోంది. ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. పాక్ ప్రేరేపిత జీహాదీ ఉగ్రవాదానికి తోడు కొత్తగా ఐసిస్ నరరూప రాక్షసులు తలలను నరికి భయోత్పాతం సృష్టించే కొత్త టెక్నిక్ కనిపెట్టారు. ముఖ్యంగా ఐసిస్ ఉగ్రవాదులు ఆన్ లైన్లో చాలా ఆకర్షణీయమైన ప్రచారం చేస్తున్నారు. వారి ప్రకటనలు లక్షల మందిని ఆకర్షిస్తున్నాయట. చదువుకున్న ముస్లిం యువతీ యువకులు చాలా మంది ఐసిస్ ఆన్ లైన్ పోస్టింగ్స్ ను తెగ చూస్తున్నారని టాక్. అలా ఐసిస్ యాక్టివ్ సభ్యులుగానో, సానుభూతిపరులుగానో మారుతున్నారు. ఐటీ కంపెనీల్లో పనిచేసే ఇంజినీర్లు కూడా ఈ మాయలో పడుతున్నట్టు అనుమానాలున్నాయి.
హైదరాబాద్ లోనూ ఐసిస్ పట్ల ఆకర్షితులైన వారు ఉన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారి సంఖ్య పెరిగే కొద్దీ సైబర్ టవర్స్ మొదలు హైటెకి్ సిటీ ఏరియాకే కాదు, మొత్తం నగరానికే ముప్పు వాటిల్లవచ్చు. ఈ మధ్య ఓ ఐటీ కంపెనీ ఉద్యోగి ఆఫీసు సిస్టంలోనే ఐసిస్ ప్రకటనలను డౌన్ లోడ్ చేశాడు. ఇది గమనించిన కంపెనీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైటెక్ సిటీలో ఐసిస్ సానుభూతి పరులు గణనీయంగానే ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వారి సహాయంతో గానీ, సహాయం లేకుండా గానీ ఉగ్రవాదులు దాడులకు ప్లాన్ చేస్తే పరిస్థితి ఘోరంగా ఉంటుందని భావిస్తున్నారు.
అందుకే, అన్ని ఐటీ కంపెనీల సెక్యూరిటీ సిబ్బందికీ ఆయుధాలు సమకూర్చాలని సైబరాబాద్ పోలీసులు భావిస్తున్నారు. కనీసం పిస్టల్స్ అయినా ఉంటే మంచిదని వారి ఉద్దేశం. ఒకవేళ హటాత్తుగా ఉగ్రదాడి జరిగితే, పోలీసులు వచ్చే లోపు టెర్రరిస్టులను ఎదుర్కోవాలంటే సెక్యూరిటీ సిబ్బంది దగ్గర తుపాకులు ఉండాలి. అలా అయితేనే ప్రాణ నష్టం తగ్గించవచ్చు. కాబట్టిసెక్యూరిటీ సిబ్బందికి ఆయుధ లైసెన్సును ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నారు. ప్రతి ఐటీ కంపెనీకి సాయుధ సెక్యూరిటీ ఉంటే హైటెక్ సిటీలో ఉగ్రదాడులకు ఆస్కారం ఉండదని, ఒక వేళ జరిగినా తగిన విధంగా కౌంటర్ చేయవచ్చని పోలీసుల ఉద్దేశం.
ఇప్పటికే ప్రసిద్ధ ఐటీ కంపెనీ విప్రో తన భద్రతా సిబ్బందికి ఆయుధాలను సమకూర్చింది. సాయుధ సెక్యూరిటీ గార్డులున్న తొలి కంపెనీగా నిలిచింది. ఇతర కంపెనీలు కూడా అదే బాటలో సాయుధ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలన్నది పోలీసుల సూచన. జరగరానిది జరిగిన తర్వాత పశ్చాత్తాప పడేకంటే ముందు జాగ్రత్త మంచిదని వారు సూచిస్తున్నారు. ఇప్పటికే మహిళల భద్రత విషయంలో సైబరాబాద్ పోలీసులు అనేక చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఉగ్రదాడులను ఎదుర్కోవడానికి ముందస్తు చర్యలను పకడ్బందీగా తీసుకోవడంపై దృష్టి పెట్టారు. అలాగే, ఐసిస్ సానుభూతిపరులకు చెక్ పెట్టడానికి కూడా స్కెచ్ వేసినట్టు భోగట్టా.