రాష్ట్రమంతా కరోనా కారణంగా బిక్కుబిక్కుమంటూంటే.. కడప జిల్లాల్లో పేలుళ్ల మోత మోగిపోయింది. కలసపాడు మండలం మామిళ్లపల్లి దగ్గర ఉన్న ముగ్గురాయి గనిలో ఒక్క సారిగా పేలుళ్లు సంభవించాయి. పది మంది చనిపోయారు. పది మంది మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. వారి శరీరాలు తునాతునకలయ్యాయి. అవి జిలెటిన్ స్టిక్స్అని అధికారులు చెబుతున్నారు. అయితే జిలెటిన్ స్టిక్స్ పేలితే అంత తీవ్రంగా ప్రభావం ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు. గనుల్లో పేలుళ్లుకు జిలెటిన్ స్టిక్స్కు అనుమతులు ఉన్నాయో లేదో.. క్లారిటీ లేదు. అయితే పేలుడు ఘటనను మాత్రం వీలైనంత తక్కువ చేసి చూపించడానికి కడప జిల్లా అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది.
అధికారులు అనధికారికంగా ఇచ్చిన సమాచారం ప్రకారం… మామిళ్లపల్లి దగ్గర ఉన్న సున్నపురాయి గనుల్లో తవ్వకాల కోసం… జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేలుళ్లు జరుపుతున్నారు. వాటి కోసం.. ఓ వాహనం నిండా జిలెటిన్ స్టిక్స్ తీసుకు వచ్చారు. వాటిని అన్లోడ్ చేస్తూండగా ప్రమాదవశాత్తూ.. పేలిపోయాయి. పెద్ద మొత్తంలో ఉండటంతో.. అన్నీ ఒకే సారి పేలిపోవడంతో.. పది మంది తునాతునకలయ్యారు. ఆ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా పెద్ద ఎత్తున గాయాలయ్యాయి. కనీసం నాలుగైదు కిలోమీటర్ల దూరం పాటు.. పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో జిల్లా మొత్తం ఒక్క సారిగా కలకలం రేగింది.
సున్నపు రాళ్ల గనుల్ని వైసీపీకి చెందిన కొంతమంది ముఖ్యనేతల కనుసన్నల్లో మైనింగ్ చేస్తున్నారు. పేలుళ్ల కోసం జిలెటిన్ స్టిక్స్ వాడటానికి అదీ కూడా…. ట్రక్కుల కొద్దీ జిలెటిన్ స్టిక్స్ వాడటానికి పర్మిషన్ ఉందా లేదా అన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. అసలు ఆ గనులకు పర్మిషన్లు ఉన్నాయా.. అనేదానిపైనా విచారణ జరపాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వరుసగా చోటు చేసుకుంటున్న విపత్తుల సమయంలో ఇలాంటిప్రమాదాలు ప్రజల్ని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.