హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలు రెండింటిలో అధికార పార్టీలోకి ప్రతిపక్ష ఎమ్మెల్యేల వలసలు జోరుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తమిళనాడులో కూడా ఇదే ట్రెండ్ మొదలయింది. అయితే ఇక్కడిలా కాకుండా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా వారు అధికార అన్నాడీఎమ్‌కే పార్టీలోకి వలసవెళుతున్నారు. ప్రతిపక్షాలకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఇవాళ తమ పదవులకు రాజీనామాలు చేసి అన్నాడీఎమ్కేలోకి జంప్ చేయటానికి సిద్ధమయ్యారు. వీరిలో ఎనిమిది మంది విజయకాంత్ స్థాపించిన ఎమ్డీఎమ్కేకు చెందినవారు కాగా పుదియ తమిళగం పార్టీకి చెందినవారు ఒకరు, పీఎమ్‌కే పార్టీకి చెందిన వారు ఒకరు ఉన్నారు. వీరంతా ఇవాళ స్పీకర్ ధనపాల్కు రాజీనామాలు సమర్పించారు. అయితే వీరంతా కొంతకాలంనుంచి అన్నాడీఎమ్‌కేతో టచ్‌లో ఉన్నవారేనంటున్నారు. జయలలిత కేవలం సంచలనం కోసమే ఈ ఫార్స్ చేయించారని చెబుతున్నారు. రాజీనామా చేసిన డీఎమ్‌డీకే పార్టీ ఎమ్మెల్యేలలో నటుడు అరుణ్ పాండ్యన్ కూడా ఉన్నారు. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎమ్‌కే, అన్నాడీఎమ్‌కే పార్టీలలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని డీఎమ్‌డీకే అధినేత, నటుడు విజయకాంత్ నిన్న ప్రకటించారు. ఇకనుంచి తాము కింగ్ మేకర్‌గా కాక కింగ్ అవటానికి ప్రయత్నిస్తామని చెప్పారు. సొంతంగా ఒక కూటమిని ప్రారంభించే అవకాశంకూడా లేకపోలేదని విజయకాంత్ భార్య ప్రేమలత చెప్పారు.