తెలుగు మీడియా రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఏబీఎన్- ఆంధ్రజ్యోతి నేటితో పదేళ్లు పూర్తి చేసుకుంది. ఎలక్ట్రానిక్ మీడియా ఒడిదుడుకుల్లో ఉన్న సమయంలో ప్రారంభమైన చానల్.. పరిస్థితుల్ని సమర్థంగా ఎదుర్కొంటూ… బలమైన పునాదులేర్పరుచుకుంది. పాలక వర్గాల నుంచి వచ్చే ఒత్తిళ్లను.. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ… పదేళ్ల పాటు ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి పయనం సాగించింది. 2009లో వైఎస్ రెండో సారి సీఎంగా గెలిచారు. అప్పటికే ఐదేళ్లుగా ఆయన ఆంధ్రజ్యోతి పత్రికను ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్నీ పెట్టారు. ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. ప్రకటనలు ఆపేశారు. అయినప్పటికీ… ఆగిపోయిన ఆంధ్రజ్యోతిని.. మళ్లీ ప్రారంభించి… సక్సెస్ చేసిన.. వేమూరి రాధాకృష్ణ… టీవీ చానల్ ఏర్పాటుకు ఆసక్తి చూపించారు. మొదట్లో.. సీఎన్ఎన్ – ఐబీఎన్ భాగస్వామ్యంతో తెలుగు చానల్ తేవాలనుకున్నా.. అప్పట్లో వైఎస్ ప్రభుత్వ బెదిరింపుల కారణంగా డీల్ ఆగిపోయింది. దాంతో ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. ఓ దశలో.. ఆయన చానల్ ఏర్పాటు నిర్ణయంపై వెనక్కి తగ్గుదామనుకున్నారు. కానీ.. సొంతంగానే ముందడుగు వేశారు. వైఎస్ రెండో సారి గెలిచినా… తన మనసు మార్చుకోలేదు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు పెట్టినా.. పోరాడాలని నిర్ణయించుకుని చానల్ ప్రారంభించారు.
2009 దసరాకు ప్రారంభమైన చానల్ ఇప్పటి వరకూ ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకున్న పరిస్థితులు లేవు. భయం లేని కవరేజీకి… ఏబీఎన్ పెట్టింది పేరు. రాజ్ భవన్లో గవర్నర్ రాసలీలల దగ్గర్నుంచి మహిళలతో ఐపీఎస్ సీతారామాంజనేయుల వ్యవహారం వరకూ.. దేనికీ భయపడకుండా ఏబీఎన్ ప్రసారం చేసింది. రాజకీయ వార్తల్లోనూ.. ఎవరికీ భయపడని తత్వాన్ని నిర్దేశించుకుంది. అందుకే… దూకుడైన వార్తలను ఇష్టపడేవారి… నిర్మోహమాటంగా… వచ్చే న్యూస్ కోసం.. అందరి చాయిస్ ఏబీఎన్ గా మారింది. ఈ పదేళ్లలో ఆ నమ్మకం బలపడుతూ వచ్చింది. అధికార పార్టీల నిర్బంధాలు ఏబీఎన్ ఎదుర్కొంది. కొన్నాళ్లు పాటు తెలంగాణలో కేసీఆర్ బ్యాన్ చేశారు. ఇప్పుడు జగన్ ఆ పని చేస్తున్నారు. ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే ప్రయత్నం కూడా చేశారు. కానీ అవన్నీ ఏబీఎన్ ఇమేజ్ పెంచడానికే ఉపయోగపడ్డాయి.
ఎలక్ట్రానిక్ మీడియా చానళ్లు పుట్టగొడుగుల్లా ఈ పదేళ్లలో పుట్టుకువచ్చాయి. కానీ నికరంగా నిలబడిన చానళ్లు .. నాలుగైదు మాత్రమే. వాటిలో ఏబీఎన్ ఒకటి. పెద్దగా ఆర్థిక మద్దతకు లేనప్పటికీ… సమర్థవంతమైన నాయకత్వం.. ఉద్యోగుల అంకిత భావం కలగలిపి… చానల్‌ను.. ప్రముఖంగా నిలబెట్టాయి. టీడీపీకి మద్దతుగా ఉంటుందనే ముద్ర ఏబీఎన్ పై ఉంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో నిజాలు చెప్పినా.. ఏదో ఓ పార్టీ ముద్ర వేయడం ఖాయమే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తే… ప్రతిపక్ష పార్టీ తొత్తు అంటారు.. అనుకూల వార్తలు ప్రసారం చేస్తే అమ్ముడుపోయారంటారు. ఏలా చేసినా వచ్చే విమర్శలు వస్తూనే ఉంటాయి. వీటన్నింటినీ పట్టించుకోకుండా.. ఏబీఎన్ తనదైన శైలిలో వెళ్తోంది. పదేళ్లలో తెలుగు మీడియారంగంలో ఏబీఎన్ తనదైన ప్రత్యేకత సాధించుకుంది.