మెగా వారసత్వాన్ని కొనసాగించడం అంత సులభం కాదు. చాలా అంచనాలు ఉంటాయి. పోటీ ఎదుర్కోవాలి. అభిమానుల ఆశలకు అనుగుణంగా కథల్ని ఎంచుకోవాలి. వీటి మధ్య నటుడిగానూ రాణించాలి. ఇదంతా కష్టమైన ప్రక్రియే. వరుణ్ తేజ్ ఇవన్నీ చేసుకొంటూ వచ్చాడు. ‘ముకుంద’తో మొదలైన తన ప్రయాణం నేటికి సరిగ్గా పదేళ్లు. 2014 డిసెంబరు 24న ‘ముకుంద’ విడుదలైంది. ఈ పదేళ్లలో వరుణ్ చాలా నేర్చుకొన్నాడు. హిట్లు కొట్టాడు. ఫ్లాపులు తిన్నాడు. అయితే సినిమా ఫ్లాప్ అయినా నటుడిగా తనని తాను సంతృప్తిపరచుకొంటూ వెళ్లాడు.
ముకుంద, కంచె, ఫిదా, తొలి ప్రేమ, ఎఫ్ 2, ఎఫ్ 3, గద్దల కొండ గణేష్.. ఇలా వరుణ్ కెరీర్లో మర్చిపోలేని విజయాలు ఉన్నాయి. తొలి దశలో వరుణ్ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు, కొత్త కథలవైపు అన్వేషించాడు. మధ్యమధ్యలో మాస్ హీరోగా ఎదిగే ప్రయత్నం చేశాడు. గద్దలకొండ గణేష్‌లో తన ట్రాన్స్ఫర్మేషన్ పూర్తిగా కనిపిస్తుంది. నిజానికి వరుణ్‌లో మంచి మాస్ అప్పీల్ ఉంది. యాక్షన్ కథలకు తను పర్ఫెక్ట్. తన కటౌట్ ని ఎవరూ సరిగా వాడుకోలేదని అనిపిస్తుంది.
వరుణ్ కూడా యాక్షన్ కథల కంటే బాయ్ నెక్ట్స్ డోర్ సినిమాలు చేసినప్పుడు ప్రేక్షకులు ఆదరించారు. తనకంటూ ఓ సెపరేట్ మార్కెట్ క్రియేట్ అయ్యింది అక్కడే. కొన్ని ప్రయోగాలు వరుణ్ ని బాగా దెబ్బకొట్టాయి. అంతరిక్షం సినిమాపై వరుణ్ చాలా నమ్మకాలు పెట్టుకొన్నాడు. ఆపరేషన్ వాలైంటైన్ కూడా ప్రయోగాత్మక సినిమానే అనుకొన్నాడు. ఈ రెండు చిత్రాల ఫలితాలు వరుణ్ని ఇబ్బంది పెట్టాయి. గని, మట్కా.. వరుణ్ ని వెనక్కి లాగాయి.
జయాపజయాల్ని పక్కన పెడితే – తన యాటిట్యూడ్ బాగుంటుంది. ఎక్కడా గొప్పలకు పోడు. ఒదిగి ఉంటాడు. కాంట్రవర్సీలకు చాలా దూరం. సినిమా గురించి ఎంత మాట్లాడాలో, అంతే మాట్లాడతాడు. తన ఫ్యామిలీ గురించి గొప్పలు చెప్పుకోడు. తన కష్టాన్ని నమ్ముకొంటాడు. చిరంజీవి, పవన్ కల్యాణ్లంటే ప్రాణం పెట్టేస్తాడు. హిట్లు కొట్టడం ఎంత ముఖ్యమో, ప్రవర్తనతో అభిమానుల్ని ఆకట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలో వరుణ్ ముందు వరుసలో ఉంటాడు.
ఇప్పుడు వరుణ్ కి ఓ డీసెంట్ హిట్ అవసరం. మరో పదేళ్ల పాటు కెరీర్ భద్రంగా సాగాలంటే.. రాబోతున్న సినిమాలపై, కథలపై తాను తీవ్రంగా కసరత్తు చేయాలి. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ‘కొరియన్ కనకరాజు’ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. మరో పదేళ్ల జర్నీకి ఈ సినిమా ఆలంబన కావాలని, కొత్త వరుణ్ తేజ్ బయటకు రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.