అనంతపురం జిల్లా టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ. వంద కోట్ల జరిమానా విధించింది. గతంలో ప్రభుత్వం నుంచి మైనింగ్ కోసం లీజుకు భూముల్ని తీసుకున్న దివాకర్ రెడ్డి.. అనుమతించిన దాని కన్నా ఎక్కువగా మైనింగ్ చేశారని నిబంధనలు ఉల్లంఘించారని.. ఈ కారణంగా రూ. వంద కోట్ల ఫైన్ వేస్తున్నట్లుగా మైనింగ్ అధికారులు నోటీసులు పంపారు. రూ. వంద కోట్లు కట్టకపోతే ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని కూడా హెచ్చరించారు. త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో జేసీ కుటుంబానికి మండలం కోనఉప్పలపాడులో మైనింగ్ ఉంది.
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మైనింగ్‌ను రద్దు చేశారు. ఇతర మైనింగ్ లీజులపైనా ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. కొద్ది రోజుల కిందట.. అనంతపురంలోని మైనింగ్ కార్యాలయంలోనూ..జేసీ ధర్నా చేశారు. ఇప్పుడు.. ఆ ఫైన్ ను విధించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల వ్యాపారులపై కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పేట దాడి జరుగుతోంది. అందులో ప్రధానంగా మైనింగ్ ఉన్న వారికి వందల కోట్ల జరిమానా పడుతోంది. ప్రకాశం జిల్లాలో శిద్దా రాఘవరావు, రవికుమార్ సహా అనేక మందికి వందల కోట్లలోనే జరిమానాలు వేశారు. వారు కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నారు. చాలా మంది మైనింగ్ లైసెన్సుల్ని సస్పెండ్ చేశారు.
తవ్వుకున్నదానికి అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు జేసీ వంతు వచ్చింది. ఆయనపై కూడా.. వంద కోట్లకు తగ్గకుండా ఫైన్ విధించారు. తమను వెంటాడి వేధించి ఆర్థికంగా చితికిపోయేలా చేస్తున్నారని జేసీ ఫ్యామిలీ కొంత కాలంగా ఆరోపణలు చేస్తోంది. దానికి తగ్గట్లుగానే వారి ట్రావెల్స్ వ్యాపారం చితికిపోయేలా చేశారు. ఇప్పుడుగనుల వ్యాపారం కూడా నిలిచిపోయేలా చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.