బాహుబలి చూసిన కళ్లతో ఏ సినిమా చూసినా.. చిన్నదిగానే అనిపిస్తోంది. అందులోనూ విజువల్ ఎఫెక్ట్స్ చిత్రాలు తేలిపోతున్నాయి. విజువల్ ఎఫెకట్స్ పేరు చెబితే… కోట్లు ఖర్చు పెట్టాల్సిందే అని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. అందుకు తగ్గట్టుగానే బడ్జెట్లు కేటాయించుకుంటున్నారు. నాగార్జున నటిస్తున్న బాలీవుడ్ మల్టీస్టారర్ చిత్రం.. బ్రహ్మాస్త్ర. అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్ లాంటి హేమా హేమీలు ఈ చిత్రంలో నటిస్తున్నారు. సినిమా బడ్జెట్ కి దాదాపు రూ.350 కోట్లు కేటాయించార్ట. అందులో విఎఫ్ఎక్స్కి రూ.100 కోట్లు అవుతాయని తెలుస్తోంది. ఇదో సోషియో ఫాంటసీ సినిమా అని, అందుకే ఈ స్థాయిలో ఖర్చు పెట్టాల్సివస్తోందని సమాచారం. నాగ్ ఉన్నాడు కాబట్టి.. తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేసే అవకాశాలున్నాయి. ఇటీవల నాగార్జునపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. నాగ్ పార్ట్ దాదాపుగా పూర్తయ్యిందని, అవసరమైతే మరో నాలుగు రోజులు కాల్షీట్లు కేటాయిస్తే సరిపోతుందని తెలుస్తోంది. ఈ సినిమా మొత్తమ్మీద నాగ్ కనిపించేది పది నిమిషాలు మాత్రమేనట. అయితేనేం.. ఆయన పాత్ర ఓ రేంజ్లో ఉంటుందని, దానికి తగ్గట్టుగానే పారితోషికమూ అందుకున్నారని సమాచారం.