వ్యాక్సిన్లకు పబ్లిసిటీ చేసుకోవడంలో కేంద్ర ప్రభుత్వానికి వినూత్నమైన ఆలోచనలు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయో చెప్పడం కూడా కష్టం. చివరికి ప్రపంచ దేశాలు మొత్తం ఆశ్చర్యపోయేలా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల మీద మోడీ బొమ్మ ప్రముఖంగా కనిపిస్తోంది. అదే కాదు వ్యాక్సిన్ విషయంలో ప్రతి మైల్ స్టోన్ దగ్గరా ఓ ప్రచార చిత్రం రూపుదిద్దుకుంది. ఇక మోడీ పుట్టిన రోజుకు వ్యాక్సిన్ ఫెస్టివల్ నిర్వహించేశారు. ఇప్పుడు జనాలకు వంద కోట్లవ వ్యాక్సిన్ డోస్ వేస్తున్నారట. ఇక ఊరుకుంటారా..?
బాలీవుడ్ సింగర్ ను రంగంలోకి దింపారు. ఆయనతో ఓ హుషారైన పాటను పాడించారు. ఆ సింగర్ పేరు ఖైలాష్ ఖేర్. ఈయన సూపర్ సింగర్. తెలుగులోనూ టాప్ హీరోలకు పాడి సూపర్ డూపర్ హిట్లు కొట్టాడు. ఈ ఖేర్‌తో పాటను పాడించారు. ఈ పాటను 100 కోట్ల డోసులు పూర్తయ్యాక విడుదల చేస్తారు. కేంద్ర పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలో ఆయిల్, గ్యాస్ కంపెనీలు ఈ పాటకు ఫండింగ్ చేశాయి. బహుశా సీఎస్ఆర్ ఫండ్స్ తోనే అయి ఉంటుంది.
ఒక్కసారి వ్యాక్సినేషన్ 100 కోట్ల మార్కును దాటాక రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, బస్ స్టాండ్లలో ఈ థీమ్ సాంగ్ ప్లే చేయనున్నారు. సోమవారం నాటికి 100 కోట్ల వ్యాక్సినేషన్ మార్కును చేరుకుంటామని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే ఈ పాట కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా అవగాహన కోసం రూపొందించామని కేంద్రం చెబుతోంది.