రీమేక్ సినిమాలు చేయడం బహు ఈజీ అనుకొంటారంతా. మాతృకలో ఉన్నది ఉన్నట్టుగా తర్జుమా చేస్తే అది రీమేక్ అయిపోదు. దానికి మనకంటూ ఓ స్టైల్, మనదంటూ క్రియేటివిటీ జోడించాలి. మక్కీకి మక్కి దించేయాలని చూస్తే… అది రీమేక్ అవ్వదు. కాపీ పేస్ట్ అవ్వుద్ది.
సుకుమార్ సూపర్ హిట్లలో ఒకటి.. 100 % లవ్. ఈ సినిమాని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకి 100 % కాదల్ అనే పేరు పెట్టారు. కాపీ పేస్ట్ ఇక్కడి నుంచే మొదలైంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన తొలి పోస్టర్ బయటకు వచ్చింది. హీరో, హీరోయిన్ల కాలి వేళ్లు పెనవేసుకొన్న పోస్టర్ అది. ఇదీ కొత్తేం కాదు. చైతూ, తమన్నాల 100 % లవ్కీ ఈ తరహా పోస్టరే బయటకు వచ్చింది.
కథ, కథనాల్లో ఇంకెంత కాపీ ఉంటుందో ఈ పోస్టర్లే చెబుతున్నాయి. ఈ చిత్రానికి సుక్కు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. రీమేక్ రైట్స్ సొమ్ముల రూపంలో కాకుండా వాటా రూపంలో అందుకోబోతున్నాడు సుక్కు. తన దగ్గర ఇలాంటి కాన్సెప్టులు బోలెడన్ని ఉంటాయి. అయితే… వాటిని వాడకుండా ఆల్రెడీ తెలుగులో వాడేసిన పాత ఐడియాలజీనే ఈ సినిమా కోసం ఎందుకు కట్ కాపీ పేస్ట్ చేస్తున్నాడో మరి.