హైదరాబాద్: గుంటూరు ప్రభుత్వాసుపత్రి అధికారులు ఆలస్యంగా కళ్ళు తెరిచారు. ఎలుకలు పట్టుకోవటానికి మనుషులను రంగంలోకి దించగా వారు దాదాపు 100 ఎలుకలను పట్టుకున్నారు. ఎలుకల కలుగులను మూసేయించామని, దోమలు, పురుగులను చొరబడకుండా నిరోధించటానికి అన్న కిటికీలకూ నెట్లు అమరుస్తున్నామని, వార్డులలో బొరియలన్నింటినీ సిమెంట్‌తో పూడ్పిస్తున్నామని అధికారులు చెప్పారు. అటు ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసులును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. శానిటేషన్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి మేజిస్టీరియల్, డిపార్ట్మెంటల్, పోలీస్ దర్యాప్తులకు ఆదేశించింది.
మూత్రనాళ సమస్యతో పసికందును ఆసుపత్రిలో చేర్చినపుడే వార్డులో ఎలుకలు తిరగటం గమనించిన తల్లిదండ్రులు సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అయితే సిబ్బంది పట్టించుకోలేదు. మరుసటిరోజు ఎలుకలు ఒళ్ళంతా కొరకటంతో పిల్లవాడు చనిపోయాడు. ఈ ఘటనపై ప్రభుత్వ సిబ్బందిమీద ప్రజలలో తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు పదిరోజుల వయసు పసికందు ఎలుకలు కొరకటంతో చనిపోయిన ఘటనకు సంబంధించి దోషులను త్వరలోనే పట్టుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేశామని, పోస్ట్ మార్టమ్ నివేదిక ఆధారంగా దోషులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.