తెలుగువాడి కీర్తి పతాక
తెలుగు గొంతుక
ఆత్మ గౌరవ ప్రతీక
ఆత్మాభిమాన సూచిక… ఎన్టీఆర్!!
అటు సినిమా అయినా – ఇటు రాజకీయమైనా
ఎన్టీఆర్‌కి ముందు…. ఎన్టీఆర్‌కి తరవాత అని రాసుకోవాల్సిందే.
వెండి తెర గుండె చీల్చుకుంటే ఎన్టీఆర్ కనిపిస్తాడు.
రాజకీయం తనని తాను కొత్తగా నిర్వచించుకుంటే… ఎన్టీఆర్ అంటూ కొత్తగా లిఖించుకుంటుంది.
సాంఘిక, చారిత్రక, పౌరాణిక, కాల్పనిక… ఇలా ఏ పాత్ర అయినా తీసుకోండి. ఎన్టీఆర్ విశ్వరూపమే కనిపిస్తుంది. ముఖ్యంగా పౌరాణికంలో.. ఆయన రారాజు! రాముడైనా – కృష్ణుడైనా – రావణుడైనా – రాక్షసుడైనా… అందులో ఎన్టీవోడి విజృంభణ చూసి తరించిపోవాల్సిందే.
పాతికేళ్ల వయసులో – అరవై ఏళ్ల వృద్ధుడిగా కనిపిస్తే నమ్మేస్తాం.
అరవై ఏళ్ల వయసులో – ఇరవై ఏళ్ల కుర్రాడిగా దర్శనమిచ్చినా విజిల్స్ వేస్తాం.
ఎన్టీఆర్ చేసే మ్యాజిక్కే అది.
నటన ఒక్కటేనా..? అన్ని శాఖలపై అంతే ఆధిపత్యం. సంగీతం, ఎడిటింగ్, కళాశాఖ… వీటన్నింటిపైనా తిరుగులేని పట్టుంది. అందుకే మెగాఫోన్ పట్టి, అక్కడా హిట్లు కొట్టారు. దాన వీర శూర కర్ణ… ప్రపంచ సినీ చరిత్రలోనే ఓ తిరుగులేని అద్భుతం. మూడు పాత్రలూ చేస్తూ.. దర్శకత్వం వహించడం – అది కూడా అతి తక్కువ రోజుల్లో సినిమాని పూర్తి చేయగలగడం… మరెవ్వరికీ, ఎప్పటికీ సాధ్యం కాని విడ్డూరం.
క్రమశిక్షణకు మారు పేరు ఎన్టీఆర్. `నా దగ్గర లక్ష రూపాయలైనా దోచుకెళ్లండి. క్షమించేస్తా. మీ వల్ల ఒక్క నిమిషం ఆలస్యమైనా ఓర్చుకోలేను` అని సమయపాలనకు గొప్ప నిర్వచనంలా మారారు ఎన్టీఆర్. ఉదయం మూడింటికి మేల్కొని, ఆరింటికల్లా.. సెట్లో రెడీగా ఉండడం, పేకప్ చెప్పేసే వరకూ.. అంతే జోష్‌తో కనిపించడం… ఏ తరానికైనా ఆదర్శదాయకమే.
ఇక రాజకీయం..? తెలుగువాడి ఆత్మగౌరవం నినాదంతో, పార్టీ స్థాపించిన ఏడాదిలోపే, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనతని ఈ చరిత్రలో బంగారు అక్షరాలతో లిఖించేశారు. దేశమంతా విస్తరించిన కాంగ్రెస్‌ని.. తెలుగునాట కొమ్ములు వంచి, స్వారీ చేసిన వైనం.. అనితర సాధ్యమైన ఘనత. `సినిమా వాడా?` అని చులకనగా చూసిన జనాలకు `సినిమావాడి` గొప్పదనం, తెగింపు, గౌరవాన్ని… ప్రపంచానికి తెలియజేశారు ఎన్టీఆర్. ఇప్పుడు ఏ సినిమా వాడు కొత్త పార్టీ స్థాపించినా – ఆ ధైర్యం మాత్రం ఎన్టీఆర్ ఇచ్చిందే.
ప్రజా ప్రభుత్వం ఎలా ఉంటుందో?
రామ రాజ్యం వస్తే ఎలా ఉంటుందో?
కళ్లారా చూపించిన ఘనత.. ఎన్టీఆర్‌ది. ఆయన ప్రారంభించిన పధకాలకే పేర్లు మార్చి, ఇప్పటికీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు గుంజాలని చూస్తున్నాయి రాజకీయ పక్షాలు.
ఎన్టీఆర్ పుట్టి వందేళ్లయ్యింది.
కానీ ఆ చరిత్ర వెయ్యేళ్ల పాటు వినిపిస్తూనే ఉంటుంది.
ఆయన ముద్ర అలాంటిది.
ఆయన వేసిన బాట అలాంటిది.
తెలుగువాడి గొంతుకై
తెలుగు గుండె చప్పుడై
తెలుగు పదానికి నిలువెత్తు రూపమైన
ఆ మహనీయుడికి…. తెలుగు 360 ఘనంగా నివాళి అర్పిస్తోంది.
జయహో ఎన్టీఆర్!!!