వెయ్యి Sft అపార్టుమెంట్ ఫ్లాట్ అంటే చాలా విశాలంగా ఉండాలి. కానీ ఇప్పుడు కట్టే అపార్టుమెంట్లలో వెయ్యి ఎస్ఎప్టీ అయినా చాలా చిన్నగా ఉంటున్నాయి. ఇదేమిటంటే బిల్డర్లు మన ఇల్లు కాకుండా మన ఖాతాలోకి కార్పెట్ ఏరియా, బిల్టప్ ఏరియా, సూపర్ బిల్టప్ ఏరియా, సేలబుల్ ఏరియా అని కారణాలు చెప్పేస్తున్నారు. ఓ వెయ్యి ఎస్ఎఫ్టీ ఇల్లు కొనుక్కుమని ఇరుకుగా కాకుండా కాస్త కాళ్లు చాపుకుని కూర్చోవని అనుకుంటే మొదటికే మోసం వస్తోంది.
కొత్తగా ఇల్లు కొనాలనుకుంటున్న వారు అసలు తమ ఒరిజినల్ ఫ్లాట్ ఎంత విస్తీర్ణంలో ఉంటుందో ఖచ్చితంగా లెక్కించుకోవాలి. కార్పెట్ ఏరియా, బిల్టప్ ఏరియా, సూపర్ బిల్టప్ ఏరియా, సేలబుల్ ఏరియా ఇలా ప్రతీ దాన్ని చూడాలి. బయటి గోడలను మినహాయించి ఇంటి లోపల ఉండే విస్తీర్ణం కార్పెట్ ఏరియా కిందకు వస్తుంది. హాల్, పడక గదులు, వంటగది, స్నానాల గదుల వరకు కార్పెట్ ఏరియా. అంటే మనకు వచ్చే ఫ్లాట్ కార్పెట్ ఏరియా.
కానీ మనం డబ్బులు చెల్లించాల్సిన ఏరియా ఇంకా ఉంటుంది. బయటి గోడలు, బాల్కనీలు బిల్టప్ ఏరియా పరిధిలోకి వస్తాయి. ఇక అపార్టుమెంట్లలో ఉపయోగించే కారిడార్, మెట్లు, లిఫ్ట్ మార్గాలు అన్నీ కలిపి ఫ్లాట్ లో వాటా వేస్తారు. ఇంటి కొనుగోలుదారుడికి ఫైనల్ గా ఈ విస్తీర్ణాన్నే విక్రయిస్తారు కాబట్టి దీన్నే సేలబుల్ ఏరియా అంటారు. అంటే మనకు ఆఫర్ చేసే ఎస్ఎఫ్టీల్లో 30 శాతం విస్తీర్ణం ఉమ్మడి అవసరాలకు పోతుంది. బిల్డర్ దగ్గర 1200 చదరపు అడుగుల సూపర్ బిల్టప్ ఏరియా ఫ్లాట్ తీసుకుంటే.. ఇంటి లోపల వచ్చే కార్పెట్ ఏరియా 860 నుంచి 900 చదరపు అడుగులేనని అనుకోవచ్చు. ఈ లెక్కన ఎంత భారం పడుతుందో కూడా అంచనా వేయవచ్చు.