రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తాం, హైదరాబాదును విశ్వనగరంగా మారుస్తామన్నది కేసీఆర్ సర్కార్ నినాదం. ఆయన తనయుడు కేటీఆర్ మరో అడుగు ముందుకేసి గ్రేటర్ హైదరాబాదులో 100 రోజుల ప్రణాళికను ఘనంగా ప్రకటించారు. హైదరాబాదులు అసలు సిసలైన గ్లోబల్ సిటీ చేయడానికి అనేకానేక కార్యక్రమాలు పూర్తి చేస్తామని పెద్ద జాబితా చదివి వినిపించారు. సదరు 100 రోజులు పూర్తయినా ఆయన చెప్పిన ప్రకారం హైదరాబాద్ అద్దంలా మెరవడం లేదు.
అమెరికాలో రెండు వారాల పర్యటన తర్వాత నగరానికి వచ్చిన కేటీఆర్, సోమవారం కొన్ని ప్రాంతాల్లో రో్డ్లను పరిశీలించారు. ఆశ్చర్యపోయారు. హైదరాబాదులో రోడ్లు అంత దరిద్రంగా ఉన్నాయన్న సంగతే తెలియనట్టు రియాక్షన్ ఇచ్చారు. ఏంచేస్తున్నారంటూ అధికారులను ప్రశ్నించారు. వాళ్ల పనితీరు బాగాలేదంటూ మీడియా ముందు స్టేట్ మెంట్ ఇచ్చారు.
హైదరాబాద్ రోడ్లు అంత చండాలంగా ఉన్నాయని పులరపాలక శాఖ మంత్రికే తెలియదంటే ప్రభుత్వం ఎంత జాగరూకతతో పనిచేస్తున్నదో అర్థమవుతుంది. అధికారులు సరిగా పనిచేయలేదు సరే. మరి తెరాస కార్పొరేటర్లు ఏంచేస్తున్నట్టు? ఒక్కరూ ఇద్దరూ కాదు, 99 మంది అధికార పార్టీ కార్పొరేటర్లు తమ తమ ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నా చూడలేని స్థితిలో ఉన్నారా? అధికారులు పట్టించుకోపోవడం వల్ల రోడ్లు దారుణంగా ఉన్నాయని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మున్సిపల్ మంత్రికి చెప్పలేని స్థితిలో ఉన్నారా? అసలు ఆ కార్పొరేటర్లు ఎందుకున్నట్టు? ఏం చేస్తున్నట్టు? దీనిగురించి కూడా కేటీఆర్ సూటిగా మాట్లాడి ఉంటే బాగుండేది. తమ ప్రభుత్వ పనితీరు మెరుగుపడాలని ఒప్పుకోవడం సరిపోదు. మాటల్లో కాకుండా చేతల్లో చిత్తశుద్ధిని చూపాలి కదా.
నెలజీతం తీసుకునే ఉద్యోగులు, అధికారులంటే రాజకీయ నాయకులకు మహా అలుసు. అంతమాత్రాన వాళ్లు సరిగా పనిచేయక పోయినా ఊరుకోవాలని కాదు. అసలు ముఖ్యమంత్రి, మంత్రులు, కార్పొరేటర్లు ఏం చేస్తున్నారో ప్రజలకు జవాబు చెప్పవద్దా? రోడ్లు హటాత్తుగా ఈరోజే పాడైనట్టు ఒక్కసారి బయటకు వచ్చి అధికారులను నిందించగానే సరిపోదు. కేటీఆర్ వైఖరిని బట్టి చూస్తుంటే మరో 100 రోజులకైనా హైదరాబాద్ రోడ్లు ఒక మెట్రో సిటీ రోడ్ల స్థాయిలో బాగుపడతాయని నమ్ముదామా? ప్రస్తుతానికి నమ్ముదాం. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం !!